ఆడొచ్చు కానీ.. ఆ మ్యాజిక్‌ మిస్‌!

ABN , First Publish Date - 2020-05-09T10:05:14+05:30 IST

కొవిడ్‌-19 మహమ్మారి నేపథ్యంలో ఇప్పటికే క్రీడారంగం పూర్తిగా స్తంభించిపోయింది. భారీ నష్టం చేకూరుస్తున్నందున ఇకనైనా ఆటలను ...

ఆడొచ్చు కానీ.. ఆ మ్యాజిక్‌ మిస్‌!

ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్‌లపై విరాట్‌ కోహ్లీ

న్యూఢిల్లీ: కొవిడ్‌-19 మహమ్మారి నేపథ్యంలో ఇప్పటికే క్రీడారంగం పూర్తిగా స్తంభించిపోయింది. భారీ నష్టం చేకూరుస్తున్నందున ఇకనైనా ఆటలను పునరుద్ధరించాలని ప్రస్తుత, మాజీ క్రీడాకారులు కోరుతున్నారు. ఖాళీ స్టేడియాల్లోనైనా ఆడించాలని సూచిస్తున్నారు. టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ కూడా ప్రేక్షకుల్లేకుండా క్రికెట్‌ ఆడడం సాధ్యమేనని అన్నాడు. అయితే, స్టేడియంలో అభిమానులు చేసే ఆ మ్యాజిక్‌ను మాత్రం మిస్సవుతామన్నాడు. ప్రేక్షకులు చేసే హంగామాతో ఆటలో తీవ్రత ఉంటుందన్నాడు. ప్రేక్షకులతో మమేకమయ్యే ఆ తెలియని అనుభూతిని కోల్పోతామని విరాట్‌ తెలిపాడు. ‘ఖాళీ స్టేడియాల్లో క్రికెట్‌ సాధ్యమే. కానీ.. ప్రత్యక్షంగా అభిమానులున్నప్పుడు ఉండే ఆ మజాను మాత్రం మిస్సవుతాం. ఆటనెంతగానో ప్రేమించే ప్రేక్షకుల ముందు ఆడేందుకు మేం అలవాటు పడ్డాం. వాళ్ల ప్రోత్సాహం, మద్దతుతో గేమ్‌లో ఎన్నో అనుభూతులు కలుగుతాయి. స్టేడియంలో ప్రేక్షకులు ఓ మాయాజాలం సృష్టిస్తారు. ఖాళీ స్టేడియాల్లో ఇదంతా కనిపించదు’ అని ఓ స్పోర్ట్స్‌ చానెల్‌ షోలో విరాట్‌ చెప్పుకొచ్చాడు. ఈ ఏడాది అక్టోబరులో ఆస్ట్రేలియాలో టీ20 వరల్డ్‌కప్‌ జరగాల్సి ఉంది. అయితే, కరోనా ముప్పు కారణంగా ప్రేక్షకులకు అనుమతి లేకుండా ఖాళీ స్టేడియాల్లో టోర్నీని నిర్వహించాలని పలు దేశాల క్రికెట్‌ బోర్డులు ప్రతిపాదిస్తున్నాయి. 

Updated Date - 2020-05-09T10:05:14+05:30 IST