వాళ్లను పట్టించుకోను
ABN , First Publish Date - 2020-04-07T09:54:31+05:30 IST
రిటైర్మెంట్‌పై వస్తున్న ఊహాగానాలను రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత, వెటరన్ రెజ్లర్ సుశీల్ కుమార్ కొట్టిపడేశాడు. ఒలింపిక్స్ వాయిదా పడడంతో మెగా ...

రిటైర్మెంట్‌పై ఆలోచన లేదు.. టోక్యోకు సిద్ధమవుతున్నా
న్యూఢిల్లీ: రిటైర్మెంట్‌పై వస్తున్న ఊహాగానాలను రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత, వెటరన్ రెజ్లర్ సుశీల్ కుమార్ కొట్టిపడేశాడు. ఒలింపిక్స్ వాయిదా పడడంతో మెగా టోర్నీ టికెట్ కోసం సన్నద్ధమవుతున్నట్టు చెప్పాడు. ‘నా పనై పోయిందని మాట్లాడడం అందరికీ అలవాటుగా మారింది. వాగే వాళ్ల గురించి పట్టించుకోను. రోజుకు రెండుసార్లు సాధన చేస్తున్నా. దేవుడి దయ ఉంటే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తా’ అని సుశీల్ చెప్పాడు. 36 ఏళ్ల సుశీల్ 2019 వరల్డ్ చాంపియన్‌షి్‌పతో ఫామ్‌లోకి వచ్చాడు. కానీ, ఆ తర్వాత అదే జోరును కొనసాగించలేకపోయాడు. 74 కిలోల కేటగిరీలో తలపడుతున్న సుశీల్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించడంలో విఫలమవుతూనే ఉన్నాడు. కానీ, తాను మాత్రం పోరాటం చేస్తూనే ఉంటానని చెప్పాడు.
నర్సింగ్ రీఎంట్రీ..
ఒలింపిక్స్ వాయిదా పడడంతో సుశీల్ గట్టిపోటీదారుగా భావిస్తున్న నర్సింగ్ యాదవ్ కూడా జూలైలో డోపింగ్ బ్యాన్‌ను ముగించుకుని మళ్లీ బరిలోకి దిగే అవకాశం ఉంది. యాదవ్‌కు తప్పకుండా అవకాశాలు కల్పిస్తామని భారత రెజ్లింగ్ సమాఖ్య ఈపాటికే ప్రకటించింది. 2016 రియో ఒలింపిక్స్‌లో సుశీల్‌ను కాదని యాదవ్‌కు అవకాశం కల్పించారు. కానీ, డోపింగ్‌లో విఫలమవడంతో అప్పట్లో అతడిపై నాలుగేళ్ల నిషేధం పడింది. అయితే, రీఎంట్రీ ఇవ్వనున్న నర్సింగ్‌కు సుశీల్ స్వాగతం పలికాడు. ఇద్దరి ముఖాముఖి గురించి అడిగితే.. సమయం వచ్చినప్పుడు చూద్దామని దాటవేశాడు. 74 కిలోల విభాగంలో జితేందర్ కుమార్ కూడా గట్టి పోటీదారుగా మారాడు. ఆసియా చాంపియన్‌షి్‌పలో అతడు కాంస్య పతకం సాధించాడు.