సోఫీ సంచలనం

ABN , First Publish Date - 2020-11-06T07:16:31+05:30 IST

డిఫెండింగ్‌ చాంపియన్‌కు షాకిచ్చి శుభారంభం అందుకున్న మిథాలీ సేన రెండో మ్యాచ్‌లో ఘోరమైన ప్రదర్శన చేసింది. లెఫ్టామ్‌ స్పిన్నర్‌ సోఫీ ఎకల్‌స్టోన్‌ (3.1-1-9-4) సంచలన బౌలింగ్‌తో వణికించడంతో....

సోఫీ సంచలనం

వెలాసిటీ బౌలర్‌ సూపర్‌ స్పెల్‌ 

మిథాలీ సేన చిత్తు  

మహిళల టీ20  చాలెంజ్‌


షార్జా: డిఫెండింగ్‌ చాంపియన్‌కు షాకిచ్చి శుభారంభం అందుకున్న మిథాలీ సేన రెండో మ్యాచ్‌లో ఘోరమైన ప్రదర్శన చేసింది. లెఫ్టామ్‌ స్పిన్నర్‌ సోఫీ ఎకల్‌స్టోన్‌ (3.1-1-9-4) సంచలన బౌలింగ్‌తో వణికించడంతో.. ట్రయల్‌ బ్లేజర్స్‌తో పోరులో వెలాసిటీ జట్టు 9 వికెట్లతో చిత్తయింది. మహిళల టీ20 చాలెంజ్‌లో భాగంగా గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన మిథాలీ సారథ్యంలోని వెలాసిటీ జట్టు 15.1 ఓవర్లలో 47 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్‌ షఫాలీ వర్మ (13) టాప్‌ స్కోరర్‌. ఆ తర్వాత రెండంకెల స్కోరు కాస్పెరెక్‌ (11 నాటౌట్‌), శిఖా పాండే (10)దే.  టీ20 వరల్డ్‌ నెంబర్‌ వన్‌ బౌలర్‌ ఎకిల్‌స్టోన్‌తోపాటు జులన్‌ గోస్వామి, రాజేశ్వరీ గైక్వాడ్‌ రెండేసి వికెట్లు పడగొట్టారు. స్వల్ప లక్ష్యాన్ని ట్రయల్‌ బ్లేజర్స్‌ 7.5 ఓవర్లలో 49/1తో ఛేదించింది. డాటిన్‌ (29 నాటౌట్‌), ఘోష్‌ (13 నాటౌట్‌) లాంఛనం పూర్తి చేశారు. ఎకల్‌స్టోన్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచింది.


4/9: టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న మిథాలీ నిర్ణయం బెడిసికొట్టింది. వెటరన్‌ పేసర్‌ గోస్వామి, ఎకల్‌స్టోన్‌ ధాటికి పవర్‌ ప్లేకంటే ముందే 22 పరుగులకే వెలాసిటీ జట్టులో సగంమంది పెవిలియన్‌కు చేరారు. ఓపెనర్లు షఫాలీ, వ్యాట్‌ (3)లను జులన్‌ అవుట్‌ చేయగా.. మిథాలీ రాజ్‌(1), వేదా కృష్ణమూర్తి (0), సుష్మా వర్మ (1)ను సోఫీ పెవిలియన్‌కు చేర్చి దెబ్బ కొట్టింది. ఇక రాజేశ్వరి రెండు వికెట్లు.. దీప్తి శర్మ ఒక వికెట్‌తో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేశారు. రెండో స్పెల్‌ బౌలింగ్‌కు వచ్చిన ఎకిల్‌స్టోన్‌..ఆలమ్‌ వికెట్‌ తీసి ప్రత్యర్థి ఇన్నింగ్స్‌కు ముగింపు పలికింది. 


మైనస్‌కు రన్‌రేట్‌: ఈ ఓటమితో వెలాసిటీ జట్టు నెట్‌ రన్‌రేట్‌ మైనస్‌ (-1.869)కు చేరింది. దాంతో వెలాసిటీ ఫైనల్‌ బెర్త్‌ శనివారం ట్రయల్‌బ్లేజర్స్‌ (3.905), సూపర్‌నోవాస్‌ (-0.204) జట్ల మధ్య జరిగే మ్యాచ్‌ ఫలితంపై ఆధారపడి ఉంది. నోవాస్‌ ఓడితే వెలాసిటీ ఫైనల్‌ చేరుతుంది. నోవాస్‌ గెలిస్తే..నెట్‌ రన్‌రేట్‌తో ఫైనలిస్టును నిర్ధారిస్తారు.


రెండు మ్యాచ్‌లు కష్టం..

12 గంటల లోపే రెండు రోజులు మ్యాచ్‌లు ఆడడం కష్టం. దాంతో మధ్యాహ్నం జరిగిన రెండో పోరుకు మావాళ్లు సిద్ధం కాలేకపోయారు.                    

-మిథాలీ రాజ్‌


సంక్షిప్తస్కోరు

వెలాసిటీ: 15.1 ఓవర్లలో 47 ఆలౌట్‌ (షఫాలీ వర్మ 13, కాస్పెరెక్‌ 11 నాటౌట్‌, శిఖా పాండే 10, సోఫీ ఎకల్‌స్టోన్‌ 4/9, జులన్‌ గోస్వామి 2/13, గైక్వాడ్‌ 2/13, దీప్తి శర్మ 1/8).


ట్రయల్‌ బ్లేజర్స్‌: 7.5 ఓవర్లలో 49/1 (డాటిన్‌ నాటౌట్‌ 29, రిచా ఘోష్‌ నాటౌట్‌ 13, మంధాన 6, కాస్పెర్‌ 1/5).



Updated Date - 2020-11-06T07:16:31+05:30 IST