వాయిదా వైపే!
ABN , First Publish Date - 2020-03-23T10:04:02+05:30 IST
కరోనా మహమ్మారి సెగ ఎట్టకేలకు టోక్యో ఒలింపిక్స్ నిర్వాహకులకు తాకింది. విశ్వక్రీడలను నిర్ణీత షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తామంటూ పదేపదే చెబుతూ వస్తున్న

గుట్టుగా ఏర్పాట్లు చేస్తున్న ఒలింపిక్ నిర్వాహక కమిటీ
టోక్యో: కరోనా మహమ్మారి సెగ ఎట్టకేలకు టోక్యో ఒలింపిక్స్ నిర్వాహకులకు తాకింది. విశ్వక్రీడలను నిర్ణీత షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తామంటూ పదేపదే చెబుతూ వస్తున్న నిర్వాహక కమిటీ పునరాలోచనలో పడింది. ఒలింపిక్స్‌ను జరపాలన్న జపాన్ ప్రభుత్వ ఆలోచనకు భిన్నంగా..వాటిని వాయిదా వేయడంతోపాటు ప్రత్యామ్నాయ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్టు ఈ వ్యవహారాలతో సంబంధం ఉన్న ఇద్దరు అధికారులు ఆదివారం వెల్లడించారు. వాస్తవంగా టోక్యో ఒలింపిక్స్ జూలై 24 నుంచి ఆగస్టు 9 వరకు జరగాల్సి ఉంది. కానీ కరోనా వైరస్ ధాటికి క్రీడా రంగం కుదేలైంది. పలు పోటీలు వాయిదా పడ్డా యి. అలాగే ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలు రద్దయ్యాయి.
అథ్లెట్ల శిక్షణ కార్యక్రమాలూ బందయ్యాయి. దాంతో ఒలింపిక్స్‌ను వాయిదా వేయాలని పలు దేశాల ఒలింపిక్ కమిటీలు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)ని కోరాయి. చాలామంది అథ్లెట్లు కూడా వాయిదాకే మొగ్గుచూపుతున్నారు. పరిస్థితులు ఇంత తీవ్రంగా ఉన్నా...జపాన్ ప్రభుత్వంతోపాటు ఐఓసీ కూడా ఒలింపిక్స్‌ను యధాప్రకారం నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్నాయి. ఒలింపిక్స్ రద్దయితే..రూ. 21,500 కోట్ల స్వదేశీ స్పాన్సర్‌షిప్, ఏర్పాట్లపై వెచ్చించిన రూ. 90 వేల కోట్లు నష్టపోతామని జపాన్ ప్రధాని షింజొ అబే ఇటీవల ఆందోళన వ్యక్తంజేశారు. ‘వాయిదా వేసేందుకు అవసరమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్ల వివరాలను తయారు చేయాల్సిందిగా మమ్మల్ని కోరారు’ అని నిర్వాహక కమిటీకి చెందిన ఇద్దరు అత్యున్నత అధికారులు వెల్లడించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ముసాయిదా తయారీలో ఈ ఇద్దరు కీలక పాత్ర పోషిస్తుండడం గమనార్హం. ‘బీ, సీ, డీ అనే మూడు ప్రత్యామ్నాయ సమయాలతో కూడిన ప్రణాళికలను మేం రూపొందిస్తున్నాం’ అని వారు తెలిపారు. ఒలింపిక్స్ ఆలస్యమైతే ఎంత నష్టం వస్తుందన్న వివరాలనూ వారు సేకరిస్తున్నారు.
అయితే ఈ విషయమై స్పందించేందుకు అటు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ, ఇటు జపాన్ ప్రభుత్వ వర్గాలు అందుబాటులో లేవు. నిర్వాహక కమిటీ రెండు ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఒకటి క్రీడలను ఒకటి లేదా రెండు సంవత్సరాలు వాయిదా వేయడంకాగా..ప్రేక్షకులు లేకుండా నిర్వహించడం రెండోది. వీటిపై ఈ నెలాఖరులో జరిగే నిర్వాహక కమిటీ చర్చించనుందని ఆ అధికారులు చెప్పారు. అయితే నెల లేదా నెలన్నరపాటు వాయిదా వేసే ఆలోచన కూడా ఉన్నట్టు సమాచారం. ఏ నిర్ణయమైనా జపాన్ ప్రభుత్వంకాక ఐఓసీనే వెల్లడించాల్సి ఉంది. ఈవారంలో ఐఓసీ బోర్డు సమావేశం జరగనుంది.