క్రికెట్ ప్రారంభమైతే ధోనీ సాధించగలిగే.. మూడు రికార్డులివే..
ABN , First Publish Date - 2020-05-17T20:34:00+05:30 IST
టీం ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తన కెరీర్‌లో ఎన్నో అరుదైన రికార్డులు సాధించాడు. కెప్టెన్సీతో పాటు.. బ్యాటింగ్, కీపింగ్‌లలోనూ ఎన్నో రికార్డులను తన ఖాతాలో

టీం ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తన కెరీర్‌లో ఎన్నో అరుదైన రికార్డులు సాధించాడు. కెప్టెన్సీతో పాటు.. బ్యాటింగ్, కీపింగ్‌లలోనూ ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే 2019 క్రికెట్ ప్రపంచకప్ తర్వాత ధోనీ మళ్లీ క్రికెట్ మైదానంలో కనిపించలేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అయినా అతను ఆడుతాడని అంతా భావించారు. కానీ, కరోనా వైరస్ కారణంగా ఐపీఎల్ రద్దు కావడంతో అది కూడా కుదరలేదు. అయితే ప్రస్తుతం నెలకొన్న సమస్యలు అన్ని తగ్గి మళ్లీ క్రికెట్ ప్రారంభమైతే.. ధోనీ ఓ మూడు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకొనే అవకాశం ఉంది.
వన్డేలో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్ల లిస్ట్‌లో 10,733 పరుగులతో ధోనీ ఐదో స్థానంలో ఉన్నాడు. ఒకవేళ ధోనీ మరో 116 పరుగులు చేస్తే.. రాహుల్ ద్రవిడ్(10,899)ను అధిగమించి మూడో స్థానంకి వెళ్లే అవకాశం ఉంది. దీంతో పాటు మరో రెండు టీ-20 క్యాపులు అందుకుంటే 100 టీ-20 క్యాపులు అందుకున్న రెండో భారత ఆటగాడిగా అతను రికార్డుల్లోకి ఎక్కుతాడు. ఈ రికార్డు ఇప్పటివరకూ 108 క్యాపులతో రోహిత్ శర్మ మాత్రమే సాధించాడు. పరిస్థితులు మామూలుగా మారి ఐపీఎల్ ప్రారంభమై.. ధోనీ మరో 10 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడితే.. 200 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా అతను రికార్డుల్లోకి ఎక్కే అవకాశం ఉంది.