క్రికెట్‌లో ఈ పద్ధతి కరెక్ట్ కాదు: సునీల్ గవాస్కర్

ABN , First Publish Date - 2020-12-11T02:34:45+05:30 IST

దక్షిణాఫ్రికాత-ఇంగ్లండ్ మధ్య గత వారం జరిగిన రెండో టీ20లో ఇంగ్లండ్ అనలిస్ట్ నాథన్ లీమన్ జట్టు సభ్యులకు పంపిన కోడ్ సందేశంపై

క్రికెట్‌లో ఈ పద్ధతి కరెక్ట్ కాదు: సునీల్ గవాస్కర్

న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా-ఇంగ్లండ్ మధ్య గత వారం జరిగిన రెండో టీ20లో ఇంగ్లండ్ అనలిస్ట్ నాథన్ లీమన్ జట్టు సభ్యులకు పంపిన కోడ్ సందేశంపై టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ పెదవి విరిచాడు. క్రికెట్‌లో ఇలాంటి పద్ధతులు మంచివి కాదని తప్పుబట్టాడు. కొన్ని అక్షరాల కలయికతో ఉన్న ప్లకార్డులను ప్రదర్శిస్తూ ఫీల్డింగ్ ప్లేస్‌మెంట్లను మార్చాలన్న సంకేతాన్ని కెప్టెన్ మోర్గాన్‌కు పంపాడు. తాము మ్యాచ్ అధికారుల నుంచి అనుమతి తీసుకున్నట్టు ఇంగ్లండ్ స్పష్టం చేసినప్పటికీ, క్రికెట్‌లో ఇలా కోడ్ పరిభాషల పద్ధతి మంచిది కాదని గవాస్కర్ పేర్కొన్నాడు. ఆటగాళ్లతో మాట్లాడేందుకు బోల్డన్ని విధానాలు అందుబాటులో ఉండగా ఇదేం పద్ధతని ప్రశ్నించాడు.  


‘‘కెప్టెన్‌గా నేనైతే ఇలాంటి దానికి అంగీకరించను. నేను కనుక కెప్టెన్ అయితే, ఫీల్డింగ్ ప్లేస్‌మెంట్ మార్చేందుకో, బౌలింగ్ చేంజింగ్ గురించో చెప్పేందుకు 12వ ఆటగాడిని వాటర్ బాటిలో, మరోటో ఇచ్చి మైదానంలోకి పంపిస్తా. అలా మనం చెప్పాల్సింది చెప్పొచ్చు. లేదంటే బౌండరీ వద్ద ఉన్న ఫీల్డర్ ద్వారా కోచ్ ఆ సందేశాన్ని పంపొచ్చు’’ అని గవాస్కర్ పేర్కొన్నాడు. 


అయితే, ఇలా కోడ్ పరిభాషలో ఆటగాళ్లకు సూచనలు ఇవ్వడం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది మొదట్లో పాకిస్థాన్ సూపర్ లీగ్‌లోనూ ఇలానే జరిగింది. పీఎస్ఎల్‌లో ముల్తాన్ సుల్తాన్స్ జట్టుతో ఉన్న లీమన్ ఇలాంటి కోడ్ పరిభాషనే ఉపయోగించి మెసేజ్ చేరవేశాడు. ఇలాంటి వ్యూహాలకు చెక్ పెట్టేందుకు ఐసీసీ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నాడు. ఇలాంటి విధానాన్ని ఐసీసీ అనుమతించినదీ, లేనిదీ తనకు తెలియదని, ఇప్పటి వరకు ఈ విషయం తమకు తెలియదని గవాస్కర్ తెలిపాడు. తొలిసారి ఇలా చూస్తున్నామని పేర్కొన్నాడు. డీఆర్ఎస్ తీసుకునే విషయంలోనూ ఇలాంటి కోడ్ భాష ఉందా? అని గవాస్కర్ ప్రశ్నించాడు. 

Updated Date - 2020-12-11T02:34:45+05:30 IST