మూడోరోజు వర్షార్పణం

ABN , First Publish Date - 2020-07-19T09:11:34+05:30 IST

ఈ టెస్టులో గెలుపొంది సిరీస్‌ చేజిక్కించుకోవాలన్న ఇంగ్లండ్‌ ఆశలపై వరుణుడు నీళ్ల్లు చల్లినట్టేనా? మూడోరోజు ఆట వర్షంతో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన నేపథ్యంలో ...

మూడోరోజు  వర్షార్పణం

ఒక్క బంతీ పడకుండానే ఆట రద్దు

ఇంగ్లండ్‌-వెస్టిండీస్‌ రెండో టెస్టు

మాంచెస్టర్‌: ఇంగ్లండ్‌-వెస్టిండీస్‌ మధ్య జరుగుతున్న రెండో టెస్టు మూడోరోజు ఆటను వరుణుడు పూర్తిగా తుడిచేశాడు. శనివారం ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురవడంతో సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఆటను రద్దు చేస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు. దాంతో నిర్ణీత సమయానికంటే మూడు గంటల ముందుగానే ఆట నిలిచిపోయింది. అయితే ఆదివారం నాడు పరిస్థితులు మెరుగ్గా ఉండవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. టాస్‌ కోల్పోయి బ్యాటింగ్‌ చేపట్టిన ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ను 9 వికెట్లకు 469 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం మొదటి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన వెస్టిండీస్‌ శుక్రవారం రెండోరోజు ఆట ముగిసేసరికి వికెట్‌ నష్టానికి 32 పరుగులు చేసింది. నైట్‌ వాచ్‌మన్‌ అల్జారి జోసెఫ్‌ (14 బ్యాటింగ్‌), క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌ (6 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోరుకు వెస్టిండీస్‌ ఇంకా 437 పరుగులు వెనుకంజలో ఉంది.


ఇంగ్లండ్‌ ఆశలపై ‘నీళ్లు’..?

ఈ టెస్టులో గెలుపొంది సిరీస్‌ చేజిక్కించుకోవాలన్న ఇంగ్లండ్‌ ఆశలపై వరుణుడు నీళ్ల్లు చల్లినట్టేనా? మూడోరోజు ఆట వర్షంతో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన నేపథ్యంలో మిగిలిన రెండు రోజుల్లో 196 ఓవర్లలో వెస్టిండీ్‌తస జట్టును రెండుసార్లు ఆలౌట్‌ చేయడం ఇంగ్లండ్‌ బౌలర్లకు శక్తికి మించిన పనే. రోజంతా వర్షంతో పిచ్‌ మొత్తం కప్పి ఉంచడంతో నాలుగోరోజు ఆటలో తేమ పరిస్థితులను ఇంగ్లండ్‌ పేసర్లు సద్వినియోగం చేసుకున్నా.. ప్రత్యర్థి 19 వికెట్లను పడగొట్టడం కష్టమే. అందునా తొలి టెస్టు నెగ్గిన ఊపులో ఉన్న పర్యాటక జట్టు అంత సులువుగా లొంగుతుందా అన్నది ప్రశ్నార్థకమే. మూడోరోజు కనీసం 20 ఓవర్ల ఆటన్నా జరిగుంటే ఇంగ్లండ్‌ జట్టుకు ఒకింత అవకాశముండేది. అయితే మాంచెస్టర్‌లో ఉండే వాతావరణ పరిస్థితుల రీత్యా.. శుక్రవారం నాడు ఇంగ్లండ్‌ తమ మొదటి ఇన్నింగ్స్‌లో చకచకా ఆడడంతోపాటు 400 పరుగులకే డిక్లేర్‌ చేసి ఉంటే వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌ ఇంకా ముందుగా ప్రారంభమయ్యేది. దాంతో ప్రత్యర్థివి మరో ఒకటి రెండు వికెట్లను పడగొట్టే అవకాశమూ ఇంగ్లండ్‌కు లభించేది. 

(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)

Updated Date - 2020-07-19T09:11:34+05:30 IST