30 ఏళ్లకే సెలెక్టర్లు నన్ను ముసలోడిని చేశారు: ఇర్ఫాన్ పఠాన్

ABN , First Publish Date - 2020-05-10T03:23:19+05:30 IST

పాకిస్తాన్‌పై హ్యాట్రిక్ సాధించిన ఏకైక భారత పేసర్‌గా చరిత్ర సృష్టించిన ఇర్ఫాన్ పఠాన్ అప్పట్లో పెద్ద సంచలనం. అతడి స్వింగ్ బౌలంగ్‌ను...

30 ఏళ్లకే సెలెక్టర్లు నన్ను ముసలోడిని చేశారు: ఇర్ఫాన్ పఠాన్

న్యూఢిల్లీ: పాకిస్తాన్‌పై హ్యాట్రిక్ సాధించిన ఏకైక భారత పేసర్‌గా చరిత్ర సృష్టించిన ఇర్ఫాన్ పఠాన్ అప్పట్లో పెద్ద సంచలనం. అతడి స్వింగ్ బౌలింగ్‌ను పాక్ లెజెండ్ వసీం అక్రమ్‌తో పోల్చేవారు. బౌలింగ్‌తోపాటు తనలోని బ్యాటింగ్ ప్రతిభనూ ఇర్పాన్ బయటపెట్టాడు. అయితే రెండింటిపై ఏకకాలంలో దృష్టి పెట్టడంతో పఠాన్ బౌలింగ్‌ కొద్దిగా లయ తప్పింది. ఈ నేపథ్యంలో సెలెక్టర్లు అతడిని జట్టు నుంచి తప్పించారు. అప్పటికి ఇర్ఫాన్ వయసు 28 సంవత్సరాలే. అప్పటి నుంచి తిరిగి జట్టులోకి రావాలని పఠాన్ చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. చివరికి ఈ ఏడాది ప్రారంభంలో 35 ఏళ్ల పఠాన్ అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. సురేశ్ రైనాతో నేడు ఇన్‌స్టాగ్రాం లైవ్ సెషన్‌లో పాల్గొన్న పఠాన్ అనేక విషయాలను పంచుకున్నాడు. ముఖ్యంగా భారత జట్టు సెలెక్టర్లపై అసహనం వ్యక్తం చేశాడు. 30 ఏళ్ల వయసున్న తనను సెలెక్టర్లు వెటరన్ క్రికెటర్ల జబితాలో చేర్చేశారని, దాని వల్ల తనకు మళ్లీ జట్టులో స్థానం కూడా కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. 29 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన ఆస్ట్రేలియా ఆటగాడు మైక్ హస్సీ రిటైర్ అయ్యే సమయానికి 12,398 పరుగులు చేశాడని, క్రికెట్ అభిమానులతో మిస్టర్ క్రికెట్‌గా పేరు గడించాడని చెప్పాడు. 30 ఏళ్లు దాటినంత మాత్రాన వయసయిపోయినట్లు ఎంతమాత్రం కాదని అన్నాడు. అయితే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్లతో పోల్చితే భారత్‌ ఆలోచన విధానమే వేరుగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశాడు. 


ఇదిలా ఉంటే సురేశ్ రైనా కూడా బీసీసీఐ సెలెక్టర్లపై అసహనం వ్యక్తం చేశాడు. తనను జట్టు నుంచి తొలగిస్తున్నట్లు మాజీ సెలెక్టర్ ఎంఎస్‌కే ప్రసాద్ తనకు చెప్పలేదన్నాడు. అయితే ఆయన తనకు ఈ విషయాన్ని తెలియజేసినట్లు చెబుతున్నాడని, అది అవాస్తవమని తెలిపాడు. మళ్లీ భారత్‌కు ఆడగలనన్న నమ్మకం తనకుందని, దానికోసం కష్టపడుతున్నానని రైనా చెప్పుకొచ్చాడు.

Updated Date - 2020-05-10T03:23:19+05:30 IST