వన్డే, టీ-20 పగ్గాలు ధోనీకే

ABN , First Publish Date - 2020-12-28T09:49:59+05:30 IST

ఈ దశాబ్దపు అత్యుత్తమ క్రికెట్‌ జట్లను అంతర్జాతీయ క్రికెట్‌ కమిటీ (ఐసీసీ) ఆదివారం ప్రకటించింది. మూడు ఫార్మాట్లలోనూ ఎంపికచేసిన ఈ జట్లలో భారత క్రికెట ర్లు ఆధిపత్యం చెలాయించారు...

వన్డే, టీ-20 పగ్గాలు ధోనీకే

టెస్ట్‌ జట్టు సారథి కోహ్లీ 

దశాబ్ది జట్లను ప్రకటించిన ఐసీసీ

మహిళల్లో మిథాలీ, హర్మన్‌కు చోటు 


దుబాయ్‌: ఈ దశాబ్దపు అత్యుత్తమ క్రికెట్‌ జట్లను అంతర్జాతీయ క్రికెట్‌ కమిటీ (ఐసీసీ) ఆదివారం ప్రకటించింది. మూడు ఫార్మాట్లలోనూ ఎంపికచేసిన ఈ జట్లలో భారత క్రికెట ర్లు ఆధిపత్యం చెలాయించారు. దిగ్గజ ఆటగాడు మహేంద్ర సింగ్‌ ఽధోనీ వన్డే, టీ20 జట్ల కెప్టెన్‌గా ఎంపికవడం విశేషం. ఇక విరాట్‌ కోహ్లీ దశాబ్ది టెస్ట్‌ జట్టు సారథిగా ఎంపికయ్యాడు. జట్లకు సంబం ధించి..పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో టీమిండియా క్రికెటర్లదే హవా. వన్డే జట్టులో ముగ్గురు, టీ20 జట్టులో నలుగురు భారత ఆటగాళ్లకు చోటు దక్కింది. ఈ ఏడాది ఆగస్టులో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన 39 ఏళ్ల ధోనీతోపాటు కోహ్లీ, ఓపెనర్‌ రోహిత్‌ శర్మ వన్డే జట్టుకు ఎంపికయ్యారు. టీ20 జట్టులో ధోనీ, రోహిత్‌, కోహ్లీతోపాటు పేసర్‌ జస్ర్పీత్‌ బుమ్రాకు చోటు దక్కింది. టెస్ట్‌ జట్టు సారథిగా ఎంపికవడమేకాదు..అన్ని ఫార్మాట్ల దశాబ్ది జట్లలో స్థానం లభించిన ఏకైక క్రికెటర్‌ కోహ్లీయే. టెస్ట్‌ జట్టుకు రవిచంద్రన్‌ అశ్విన్‌ ఎంపికయ్యాడు. సోమవారం వర్చువల్‌గా జరిగే ‘దశాబ్ది అవార్డుల’ కార్యక్రమాన్ని పురస్కరించుకొని దశాబ్ది జట్లను ఐసీసీ ప్రకటించింది. దశాబ్ది ఐసీసీ పురుష, మహిళా క్రికెటర్లు, టెస్ట్‌, వన్డే, టీ20ల్లో అత్యుత్తమ ఆటగాళ్ల అవార్డులతోపాటు మహిళల వన్డే, టీ20 క్రికెటర్లను సోమవారం వెల్లడించనుంది.


 మిథాలీకి చోటు..: దశాబ్ది మహిళల వన్డే జట్టులో భారత్‌ కెప్టెన్‌ మిథాలీ రాజ్‌కు చోటు దక్కింది. ఆమెతోపాటు సీనియర్‌ పేసర్‌ జులన్‌ గోస్వామి ఎంపికైంది. టీ20 జట్టులో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, పూనమ్‌ యాదవ్‌కు స్థానం కల్పించారు. తొలిసారి..క్రికెట్‌ అభిమానులు వేసిన ఓట్ల ద్వారా ఈ అవార్డులకు క్రికెటర్లను ఎంపిక చేశారు. ప్రపంచ వ్యాప్తంగా 15 లక్షలమంది ఈ ఓటింగ్‌లో పాల్గొన్నారు. 


టెస్ట్‌ జట్టు 

కోహ్లీ (కెప్టెన్‌), అలిస్టర్‌ కుక్‌, వార్నర్‌, కేన్‌ విలియమ్సన్‌, స్టీవ్‌ స్మిత్‌, సంగక్కర, స్టోక్స్‌, రవి అశ్విన్‌, డేల్‌ స్టెయిన్‌, బ్రాడ్‌,  ఆండర్సన్‌


వన్డే జట్టు

ధోనీ (కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, వార్నర్‌, కోహ్లీ, డివిల్లీర్స్‌, షకీబల్‌ హసన్‌, బెన్‌ స్టోక్స్‌, స్టార్క్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, ఇమ్రాన్‌ తాహిర్‌, మలింగ


టీ20 జట్టు

ధోనీ (కెప్టెన్‌), రోహిత్‌, గేల్‌, ఆరోన్‌ ఫించ్‌, కోహ్లీ, డివిల్లీర్స్‌, మ్యాక్స్‌వెల్‌, పొలార్డ్‌, రషీద్‌ ఖాన్‌, జస్ర్పీత్‌ బుమ్రా, లసిత్‌ మలింగ

Updated Date - 2020-12-28T09:49:59+05:30 IST