సిరీస్‌ పట్టేయాలని..

ABN , First Publish Date - 2020-12-06T10:05:45+05:30 IST

చివరి వన్డేతో పాటు తొలి టీ20 గెలిచిన ఉత్సాహంలో ఉన్న టీమిండియా కీలకపోరుకు సిద్ధమైంది. మూడు టీ20ల సిరీ్‌సలో భాగంగా సిడ్నీ క్రికెట్‌ మైదానం (ఎస్‌సీజీ)లో ఆదివారం జరిగే రెండో మ్యాచ్‌లో

సిరీస్‌ పట్టేయాలని..

మరో విజయంపై భారత్‌ దృష్టి

గెలిచి నిలవాలని ఆసీస్‌

నేడు రెండో టీ20


వన్డేల్లో పరాజయాలెలా ఉన్నా టీ20 ఫార్మాట్‌లో భారత జట్టు తన ఆధిపత్యాన్ని  చాటుకుంటోంది. వరుసగా పది మ్యాచ్‌ల్లోనూ ఓటమి లేని టీమిండియా.. తాజాగా రెండో టీ20లోనూ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. మరోసారి ఆల్‌రౌండ్‌ షోతో సిరీ్‌సను సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో ఉంది. అదే జరిగితే కీలకమైన నాలుగు టెస్టుల సిరీ్‌సకు కోహ్లీ సేన రెట్టించిన ఉత్సాహంతో సిద్ధం కావచ్చు. ఇక ఆతిథ్య ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌ను ఎలాగైనా గెలిచి సిరీ్‌స ఆశలు సజీవంగా ఉంచుకోవాలని భావిస్తోంది.


సిడ్నీ: చివరి వన్డేతో పాటు తొలి టీ20 గెలిచిన ఉత్సాహంలో ఉన్న టీమిండియా కీలకపోరుకు సిద్ధమైంది. మూడు టీ20ల సిరీ్‌సలో భాగంగా సిడ్నీ క్రికెట్‌ మైదానం (ఎస్‌సీజీ)లో ఆదివారం జరిగే రెండో మ్యాచ్‌లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. అయితే ఇక్కడ జరిగిన రెండు వన్డేల్లో భారత్‌ చిత్తుగా ఓడింది. కానీ ఈసారి ఆ ఓటములకు బదులు తీర్చుకుంటూనే సిరీస్‌ కూడా వశం చేసుకోవాలనే ఆలోచనతో ఉంది. ఈ ఫార్మాట్‌లో భారత జట్టు 2019, డిసెంబరులో విండీస్‌ చేతిలో చివరిసారిగా పరాజయం చవిచూసింది. ఆ తర్వాత శ్రీలంక, కివీ్‌సలపై వరుసగా నెగ్గింది. అటు ఆసీస్‌ మాత్రం పట్టుదలగా ఆడి ప్రత్యర్థికి ఝలక్‌ ఇవ్వాలనుకుంటోంది.


బ్యాటింగ్‌ మెరుగవ్వాలి: గాయం కారణంగా జడేజా జట్టుకు దూరమవడం లోటే. బ్యాటింగ్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న దశలో అతడి సేవలను కోల్పోవాల్సి వచ్చింది. దీంతో జడేజా స్థానాన్ని లెగ్‌ స్పిన్నర్‌ చాహల్‌ భర్తీ చేసే అవకాశం ఉంది. అలాగైతే ఐదుగురు స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మెన్‌కే జట్టు పరిమితం కావాల్సి వస్తుంది. తొలి మ్యాచ్‌లో పేసర్‌ షమి ఎక్కువ పరుగులిచ్చినా వికెట్‌ తీయలేకపోయాడు. దీంతో అతడిని తప్పించి బుమ్రాను ఆడించవచ్చు. అరంగేట్ర హీరో నటరాజన్‌ మూడు వికెట్లతో ఆకట్టుకున్నాడు. ఇక స్పిన్నర్‌ సుందర్‌ నాలుగు ఓవర్లలో 16 రన్స్‌ మాత్రమే ఇచ్చి కట్టడి చేయగలిగాడు. ఇక బ్యాటింగ్‌లో రాహుల్‌, జడేజా మాత్రమే రాణించారు. ఇప్పుడు జడ్డూ లేకపోవడంతో బ్యాట్స్‌మెన్‌ సమష్టిగా ఆడితేనే భారీ స్కోరుకు చాన్స్‌ ఉంటుంది. శాంసన్‌ కాసేపే క్రీజులో ఉన్నా ధాటిని కనబర్చాడు. ధవన్‌, కోహ్లీ, హార్దిక్‌ చెలరేగాల్సి ఉంది. ఫామ్‌లేమితో కొట్టుమిట్టాడుతున్న మనీశ్‌ స్థానంలో శ్రేయా్‌సను ఆడిస్తారా అనేది చూడాలి.


ఫించ్‌ ఆడేనా?: ఆసీస్‌ జట్టును గాయాల బెడద వేధిస్తోంది. వార్నర్‌, అగర్‌, స్టొయిని్‌సకు కెప్టెన్‌ ఫించ్‌ కూడా జత చేరాడు. మొదటి మ్యాచ్‌లో అతడు నడుము నొప్పితో బాధపడ్డాడు. దీంతో అతను ఈ పోరులో ఆడేది అనుమానంగా మారింది. ఒకవేళ అతను ఆడకపోతే మాథ్యూ వేడ్‌ తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరిస్తూ ఓపెనర్‌గా రావచ్చు. స్మిత్‌, మ్యాక్స్‌వెల్‌ బ్యాట్లు ఝుళిపిస్తే భారత్‌కు ఇబ్బందే. కామెరాన్‌ గ్రీన్‌ను ఆసీస్‌ ‘ఎ’ కోసం వదులుకున్న జట్టు వెటరన్‌ స్పిన్నర్‌ లియాన్‌ను తీసుకుంది. జంపాకు తోడుగా అతడు స్పిన్‌ బాధ్యతలు తీసుకోవచ్చు. ఆల్‌రౌండర్‌ హెన్రిక్స్‌ నుంచి భారీ ఇన్నింగ్స్‌ను జట్టు ఆశిస్తోంది.


జట్లు (అంచనా)

భారత్‌: ధవన్‌, రాహుల్‌, కోహ్లీ (కెప్టెన్‌), శాంసన్‌, మనీశ్‌/శ్రేయాస్‌, హార్దిక్‌, సుందర్‌, దీపక్‌ చాహర్‌, నటరాజన్‌, బుమ్రా/షమి, చాహల్‌.

ఆసీస్‌: డార్సీ షార్ట్‌, ఫించ్‌/వేడ్‌, స్మిత్‌, మ్యాక్స్‌వెల్‌, హెన్రిక్స్‌, క్యారీ, అబాట్‌, స్టార్క్‌, లియాన్‌, జంపా, హాజెల్‌వుడ్‌.


పిచ్‌

వన్డే సిరీ్‌సలో ఇక్కడ జరిగిన రెండు మ్యాచ్‌ల్లో పిచ్‌ ఫ్లాట్‌గా ఉండడంతో పరుగుల మోత మోగింది. నేటి మ్యాచ్‌లోనూ అదే కొనసాగవచ్చు. టాస్‌ గెలిచిన జట్టు ముందు బ్యాటింగ్‌ తీసుకునే అవకాశం ఉంది.

Read more