హత్తుకొని రోదించాం

ABN , First Publish Date - 2020-08-18T09:49:14+05:30 IST

దేశమంతా స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు జరుపుకొన్న రోజు రాత్రి భారత క్రికెట్‌ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ‘మిస్టర్‌ కూల్‌’ కెప్టెన్‌గా

హత్తుకొని రోదించాం

వీడ్కోలుపై రైనా అందుకే ఆ రోజును ఎంచుకున్నాం

చెన్నై: దేశమంతా స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు జరుపుకొన్న రోజు రాత్రి భారత క్రికెట్‌ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ‘మిస్టర్‌ కూల్‌’ కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్న మహేంద్ర సింగ్‌ ధోనీ తన సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌ను ముగిస్తున్నట్టు ప్రకటించగా.. కొద్దిసేపటికే అతడి ప్రియ మిత్రుడు సురేశ్‌ రైనా కూడా ఇదే నిర్ణయం తీసుకున్నాడు. అయితే తమ నిర్ణయాలకు ముందు.. తర్వాత ఏం జరిగిందో రైనా వివరించాడు. ధోనీ వీడ్కోలు గురించి తనకు ముందే తెలుసన్నాడు. అలాగే ఆ రోజు రాత్రి ఆప్యాయంగా హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్నామని తెలిపాడు. ‘ఆగస్టు 14న నేను, కరణ్‌ శర్మ, పీయూష్‌ చావ్లా, దీపక్‌ చాహర్‌ చార్టర్డ్‌ ఫ్లయిట్‌లో రాంచీకి చేరుకున్నాం. అక్కడ ధోనీ, మోను కుమార్‌లను పికప్‌ చేసుకుని చెన్నైకి వచ్చాం. అయితే ధోనీ గుడ్‌బై గురించి నాకు ముందే తెలుసు. నేను కూడా దానికి సిద్ధమ య్యా. ఇక రిటైర్మెంట్‌ నిర్ణయం ప్రకటించాక భావోద్వేగాలను నియంత్రించుకోలేక కన్నీటి పర్యంతమయ్యాం. ఆ తర్వాత నేను, చావ్లా, రాయుడు, కేదార్‌ జాదవ్‌, కరణ్‌ కూర్చుని కెరీర్‌, వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుకున్నాం. ఆ రాత్రంతా పార్టీ చేసుకున్నాం. ప్రతీ క్రికెటర్‌కు ఇలాంటి రోజొకటి వస్తుంది’ అని రైనా వెల్లడించాడు.


జెర్సీల కారణంగానే..

క్రికెట్‌కు వీడ్కోలు పలికేందుకు తామిద్దరం ఆగస్టు 15వ తేదీనే ఎంచుకోవడానికి గల కారణాన్ని కూడా రైనా వివరించాడు. ‘మేం ముందుగానే ఆ రోజును నిర్ణయించుకున్నాం. ఎందుకంటే మహీ జెర్సీ నెంబర్‌ 7. నా సంఖ్య 3. రెండూ కలిపితే 73 వస్తుంది. అలాగే దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఈసారికి73 ఏళ్లు నిండుతాయి. అందుకే ఇంతకంటే మంచి రోజు లేదని భావించాం’ అని రైనా చెప్పాడు. అయితే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినా ఐపీఎల్‌లో మాత్రం ఈ చెన్నై జోడీ తమ సత్తా చూపేందుకు సిద్ధమవుతోంది.

బీసీసీకి ఆలస్యంగా చెప్పాడు..

కెరీర్‌కు గుడ్‌బై చెప్పినట్టుగా సురేశ్‌ రైనా ఒక రోజు ఆలస్యంగా ఆదివారం బీసీసీఐకి సమాచారమిచ్చాడు. దీంతో సోమవారం బోర్డు అతడి సేవలను కొనియాడుతూ ప్రకటన విడుదల చేసింది. ‘అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి వైదొలుగుతున్నట్టు సురేశ్‌ రైనా ఆదివారం మాకు తెలిపాడు. వన్డే ఫార్మాట్‌లో తను కీలక ఆల్‌రౌండర్‌గా సేవలందించాడు. ఇక అతడి కెప్టెన్సీలో భారత్‌ 3-2 తేడాతో విండీ్‌సపై, 2-0తో బంగ్లాదేశ్‌పై వన్డే సిరీ్‌సలను గెలుచుకుంది. జింబాబ్వేపై 2-0తో టీ20 సిరీ్‌సను గెలుచుకుంది. అలాగే అంతర్జాతీయ టీ20లో భారత్‌ తరఫున తొలి శతకం బాదగా టెస్టు అరంగేట్రంలోనూ సెంచరీ సాధించాడు’ అని బోర్డు ప్రకటించింది. మరోవైపు ఏ క్రికెటర్‌ అయినా రిటైర్మెంట్‌కు ముందు బీసీసీఐకి సమాచారమివ్వడం సంప్రదాయంగా వస్తోంది. అలాగే యువరాజ్‌, ధోనీతో కలిసి రైనా టీమిండియా మిడిలార్డర్‌ను పటిష్ఠంగా ఉంచాడని బోర్డు అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ప్రశంసించాడు.

Updated Date - 2020-08-18T09:49:14+05:30 IST