‘సింధు లండన్ వెళ్తే తప్పేంటి?’
ABN , First Publish Date - 2020-10-24T09:27:33+05:30 IST
స్టార్ షట్లర్ పీవీ సింధు జాతీయ శిక్షణ శిబిరం నుంచి అర్ధంతరంగా వైదొలగి లండన్ వెళ్లడంపై దుమారం రేగడం

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): స్టార్ షట్లర్ పీవీ సింధు జాతీయ శిక్షణ శిబిరం నుంచి అర్ధంతరంగా వైదొలగి లండన్ వెళ్లడంపై దుమారం రేగడం తెలిసిందే. దీనిపై సింధుకు కోచ్‌లు, వెటరన్ ఆటగాళ్లు మద్దతుగా నిలిచారు. ‘లండన్‌లో తీసుకునే శిక్షణ సింధుకు ఉపయోగకరంగా ఉన్నప్పుడు అక్కడికి వెళ్లడంలో తప్పేముందని జాతీయ బ్యాడ్మింటన్ మాజీ చీఫ్ కోచ్ ఎస్ఎం ఆరిఫ్ అభిప్రాయపడ్డాడు. ‘సింధు సరైన నిర్ణయమే తీసుకుంది. కొవిడ్-19తో టోర్నమెంట్లు అన్నీ రద్దయ్యాయి. దీనివల్ల మానసికంగా వారి దృక్కోణం మారడంతో పాటు ఆటపై ఏకాగ్రత కూడా సడలుతుంది. ఈ తరుణంలో పునరుత్తేజం సాధించడానికి సింధు లండన్‌ను ఎంచుకొంది. ఈ పర్యటనలో ఆమె కొత్త విషయాలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది’ అని ఆరిఫ్ చెప్పా డు. ‘సింధు పరిణతి సాధించిన క్రీడాకారిణి. లండన్‌లో సాధన చేయడంతో ఆమె ఆట మరింత మెరుగుపడే అవకాశముంది’ అని మాజీ షట్లర్ సంజయ్ శర్మ తెలిపాడు.