ఆడుకోండి కానీ..
ABN , First Publish Date - 2020-05-24T08:16:25+05:30 IST
ఆడుకోండి కానీ..

దుబాయ్: క్రికెట్ కార్యక్రమాల పునరుద్ధరణలో పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని సభ్య దేశాలకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సూచించింది. చాలా దేశాలు కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు పోరాడుతున్న నేపథ్యంలో క్రికెట్ పునరుద్ధరణ వల్ల స్థానికంగా వ్యాధి పెరిగే అవకాశాలు లేకపోలేదని హెచ్చరించింది. చాలా దేశాలు లాక్డౌన్ నిబంధనలను సడలిస్తుండడంతో..క్రికెట్ పునరుద్ధరణకు సంబంధించి మార్గదర్శకాలను ఐసీసీ ఇప్పటికే జారీ చేసిన సంగతి తెలిసిందే. ‘సురక్షితా’నికే ప్రథమ ప్రాధాన్యమన్న కౌన్సిల్.. క్రికెట్ పునఃప్రారంభంలో స్థానిక ప్రభుత్వాల సహకారం తప్పనిసరిగా తీసుకోవాలని కోరింది. అలాగే వైరస్ ప్రభావం తీవ్రంగాలేని ప్రాంతాల్లోనే క్రికెట్‌ను పునరుద్ధరించాలని పేర్కొంది. క్రికెట్ కార్యక్రమాలు ప్రారంభమైతే స్థానికంగా వైరస్ పెరిగే ప్రమాదముందని తేలితే..అలాంటిచోట్ల పునరుద్ధరించకూడదని సలహా ఇచ్చింది. ‘ఆట ఆడే ప్రాంతం, శిక్షణ వేదికలు, చేంజింగ్ రూమ్‌లు, క్రికెట్ సామగ్రి, బంతులు..వేటితోనూ వైరస్ వ్యాప్తి జరిగే అవకాశాలు లేకుండా చర్యలు తీసుకోవాలి’ అని కోరింది.