ఇప్పుడప్పుడే అంతర్జాతీయ టోర్నీలు వద్దు
ABN , First Publish Date - 2020-05-24T08:15:36+05:30 IST
ఇప్పుడప్పుడే అంతర్జాతీయ టోర్నీలు వద్దు

మున్ముందు ఖాళీ స్టేడియాల మ్యాచ్‌లకు
అలవాటు పడాలి: క్రీడల మంత్రి రిజిజు
అక్టోబరులో ఐపీఎల్ హుళక్కి?
న్యూఢిల్లీ: దేశంలో సమీప భవిష్యత్‌లో అంతర్జాతీయ టోర్నమెంట్లు ఉండబోవని కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజు శనివారం స్పష్టంజేశారు. కొవిడ్-19 అనంతర ప్రపంచంలో ఖాళీ స్టేడియాలలో క్రీడా పోటీలు జరిగే శైలికి ప్రజలు అలవాటు పడాలని సూచించారు. ఆస్ట్రేలియా ఆతిథ్యమిచ్చే టీ20 వరల్డ్ కప్ గనుక వాయిదాపడితే వచ్చే అక్టోబరు-నవంబరులో ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. ఈనేపథ్యంలో మంత్రి ప్రకటన అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. ‘క్రీడా కార్యక్రమాల పునరుద్ధరణకు సంబంధించి కార్యాచరణపై కొద్దిరోజులుగా చర్చలు జరుపుతున్నాం. అంతకుముందే సాధన, శిక్షణ చర్యల గురించి ఆలోచించాలి. అయితే భారీస్థాయి టోర్నీల నిర్వహణకైతే ప్రస్తుతానికి అవకాశం లేదు’ అని రిజిజు అన్నారు. అంతేకాదు.. ‘స్టేడియాలలో అభిమానులు లేకుండా క్రీడా పోటీల జరిగే పరిస్థితులకు కూడా మనం అలవాటుపడాలి’ అని పిలుపునిచ్చారు. కరోనా వైరస్‌తో 13వ దఫా ఐపీఎల్ నిరవధికంగా వాయిదా పడడంపై మంత్రి స్పందిస్తూ..ఆ స్థాయి టోర్నీల నిర్వహణ విషయంలో ప్రభుత్వానిదే తుది నిర్ణయమన్నారు. ‘పరిస్థితులను బట్టి దేశంలో ఆ తరహా టోర్నమెంట్లపై సర్కారు నిర్ణయం ప్రకటిస్తుంది. ఓ క్రీడా పోటీకోసం ఆరోగ్యాన్ని పణంగా పెట్టలేం’ అని వ్యాఖ్యానించారు. ‘కరోనా వైర్‌సపై పోరాటంలో నిమగ్నమయ్యాం. అదే సమయంలో సాధారణ జనజీవనాన్ని పునరుద్ధరించడంపై కసరత్తు చేస్తు న్నాం. పలానా తేదీలలో అని చెప్పలేను కానీ ఈ ఏడాది కొన్ని టోర్నీలు జరుగుతాయి’ అని రిజిజు వివరించారు. ఇక..భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) రూపొందించిన ప్రామాణిక నిర్వాహణ విధానా (ఎప్వోపీ)ల ప్రకారం అథ్లెట్ల శిక్షణ ఉంటుందని మంత్రి చెప్పారు.
10 నుంచి బాక్సింగ్ శిక్షణ
బాక్సర్ల శిక్షణ కార్యక్రమాన్ని వచ్చేనెల 10 నుంచి మొదలుపెట్టనున్నట్టు భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎ్‌ఫఐ) ప్రకటించింది. జాగ్రత్తలను పాటిస్తూ, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పురుషులు, మహిళా బాక్సర్లందరికీ పటియాల కేంద్రంలో శిక్షణకు అనుమతిస్తామని వెల్లడించింది. ఈ సందర్భంగా.. ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన బాక్సర్లతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బీఎఫ్ఐ అధికారులు మాట్లాడి శిక్షణకు సంబంధించి పలు సూచనలు చేశారు.