పరిమిత ఓవర్లకు షమి, బుమ్రా రొటేషన్‌!

ABN , First Publish Date - 2020-11-19T08:51:50+05:30 IST

పరిమిత ఓవర్లకు షమి, బుమ్రా రొటేషన్‌!

పరిమిత ఓవర్లకు షమి, బుమ్రా రొటేషన్‌!

సిడ్నీ: ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల సిరీ్‌సకు టీమిండియా ప్రధాన పేసర్లు జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమిని రొటేషన్‌ విధానంలో ఆడించాలని భారత జట్టు యాజమాన్యం నిర్ణయించినట్టు తెలిసింది. ప్రతిష్ఠాత్మక టెస్ట్‌ సిరీ్‌సకు వారిద్దరు పూర్తిగా సిద్ధమయ్యేందుకే ఈ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఆసీస్‌లో రెండు నెలల టీమిండియా పర్యటన ఈనెల 27న జరిగే తొలి వన్డేతో ప్రారంభం కానుంది. పరిమిత ఓవర్ల సిరీ్‌సలో మూడేసి వన్డేలు, టీ20లు జరగనున్నాయి. టెస్ట్‌ సిరీస్‌ డిసెంబరు 17న మొదలు కానుంది. మరో పేసర్‌ ఇషాంత్‌ శర్మ మొదటి టెస్ట్‌ నాటికి అందుబాటులోకి రాకపోతే.. బుమ్రా, షమిపై పడే పనిభారాన్ని తగ్గించడం ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి, బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌కు సవాల్‌ కానుంది. ఆస్ట్రేలియా ‘ఎ’- భారత్‌ ‘ఎ’ జట్ల మధ్య తొలి ప్రాక్టీస్‌ మ్యాచ్‌ డిసెంబరు 6 నుంచి 8వ తేదీ వరకు జరగనుంది. అదే సమయంలో కోహ్లీ సేన రెండవ, మూడవ టీ20లు ఆడనుంది. టీమిండియా టెస్ట్‌ సిరీస్‌ ప్రణాళికలో బుమ్రా, షమి అత్యంత కీలకం అయినందున..అన్ని పరిమిత ఓవర్ల మ్యాచ్‌ల్లోనూ వారిద్దరిని ఆడించి రిస్క్‌ తీసుకోరాదని జట్టు యాజమాన్యం భావిస్తోంది. ఈ నేపథ్యంలో తెల్ల బంతుల సిరీస్‌కు బుమ్రా, షమిల విషయంలో రొటేషన్‌ విధానం పాటించే అవకాశాలున్నాయి. నెట్‌ ప్రాక్టీ్‌సలో గులాబీ, ఎర్ర బంతులతో షమి బౌలింగ్‌ చేస్తుండడం.. జట్టు యాజమాన్యం అతడిని టెస్ట్‌ల్లో తురుపు ముక్కగా వాడుకోవాలని భావిస్తుందనడానికి సూచనగా చెబుతున్నారు. మరోవైపు పదేసి ఓవర్లు వేసే అవకాశం ఉన్నందున బుమ్రా, షమి వన్డేలలో ఆడే అవకాశాలు లేకపోలేదు. అనంతరం వారు రెండో ప్రాక్టీస్‌ మ్యాచ్‌ బరిలోకి దిగితే అందులో మరిన్ని ఓవర్లు వేసే అవకాశం లభిస్తుంది. తద్వారా బుమ్రా, షమి అడిలైడ్‌లో జరిగే తొలి టెస్ట్‌ (డే/నైట్‌)కు పూర్తిగా సిద్ధమవుతారు. డిసెంబరు 11-13 తేదీల్లో జరిగే రెండో ప్రాక్టీస్‌ మ్యాచ్‌ గులాబీ టెస్ట్‌కు రిహార్సల్‌ కానుంది. అందువల్ల తొలి టెస్ట్‌ ఆడే 11 మందితో రెండో ప్రాక్టీస్‌ మ్యాచ్‌కు భారత్‌ బరిలోకి దిగే అవకాశముంది. మొత్తంగా.. భారత జట్టు ప్రణాళికలు ఈ విధంగా సాగితే.. టీ20లకు చివరి 11 మందిలో దీపక్‌ చాహర్‌, యార్కర్ల స్పెషలిస్టు నటరాజన్‌, నవ్‌దీప్‌ సైనీ, స్పిన్‌ త్రయం చాహల్‌, జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌ ఉండే అవకాశాలున్నాయి.


నెట్స్‌లో సాహా

ఐపీఎల్‌ సందర్భంగా గాయపడ్డ టెస్ట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా కోలుకున్నట్టే కన్పిస్తోంది. బుధవారం జట్టు నెట్‌ ప్రాక్టీ్‌సలో అతడు పాల్గొన్నాడు. శ్రీలంక ఎడమచేతి పేసర్‌ నువాన్‌ సెనెవిరత్నే, భారత్‌ కుడిచేతి ఫాస్ట్‌ బౌలర్‌ దయానంద గరానీ బంతులను చాలాసేపు ఎదుర్కొన్నాడు. అయితే సాహా కీపింగ్‌ మాత్రం చేయలేదు.


తప్పుకొన్న రిచర్డ్‌సన్‌

ఆసీస్‌ పేసర్‌ కేన్‌ రిచర్డ్‌సన్‌ భారత్‌తో పరిమిత ఓవర్ల సిరీ్‌సనుంచి తప్పుకొన్నాడు. ఆస్ట్రేలియాలో కొవిడ్‌ మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో కుటుంబంతో గడిపేందుకు రిచర్డ్‌సన్‌ ఆ నిర్ణయం తీసుకున్నట్టు క్రికెట్‌ ఆస్ట్రేలియా ప్రకటించింది. అతడి స్థానంలో మరో పేసర్‌ ఆండ్రూ టైని తీసుకుంది. 

Updated Date - 2020-11-19T08:51:50+05:30 IST