ఆ రోజు సచిన్‌ కోపానికి నేను బలయ్యా!

ABN , First Publish Date - 2020-04-28T10:03:46+05:30 IST

భారత బ్యాటింగ్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ క్రికెటర్‌గా కొనసాగిన సమయంలో మైదానం వెలుపల ఎంత సరదాగా ఉన్నా బరిలోకి దిగాక మాత్రం ...

ఆ రోజు సచిన్‌ కోపానికి నేను బలయ్యా!

సౌరవ్‌ గంగూలీ

న్యూఢిల్లీ: భారత బ్యాటింగ్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ క్రికెటర్‌గా కొనసాగిన సమయంలో మైదానం వెలుపల ఎంత సరదాగా ఉన్నా బరిలోకి దిగాక మాత్రం ఆటపై చాలా ఏకాగ్రత చూపేవాడు. అయితే సహచరులపై కోప్పడిన సందర్భాలు అత్యంత అరుదుగానే ఉంటాయి. 1997 వెస్టిండీస్‌ పర్యటనలో మాత్రం ఇలాంటి సన్నివేశం చోటుచేసుకుంది. ఆ సమయంలో సచిన్‌ ఆగ్రహానికి ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ బలయ్యాడట. ఐదు టెస్టుల సిరీ్‌సను అప్పుడు జట్టు 0-1తో ఓడిపోయింది. వాస్తవానికి మూడో టెస్టులో విండీస్‌కు దక్కిన ఆ విజయం భారత్‌ ఖాతాలో పడాల్సింది. కానీ కేవలం 120 పరుగుల లక్ష్యాన్ని కూడా ఛేదించలేక సచిన్‌ సేన 81 పరుగులకే కుప్పకూలింది. అప్పటికి భారత జట్టు విండీస్‌ గడ్డపై సిరీస్‌ గెలవక 11 ఏళ్లైంది. దీంతో సువర్ణావకాశం చేజారిందన్న ఆవేదనలో కెప్టెన్‌గా ఉన్న సచిన్‌ తొలిసారిగా డ్రెస్సింగ్‌ రూమ్‌లో విలపించాడని గంగూలీ తెలిపాడు.


అయితే ఆ కోపాన్ని తనపై చూపాడని, ప్రతీ రోజు ఉదయం మైదానం చుట్టూ పరిగెత్తితేనే భవిష్యత్‌లో చోటు ఉంటుందని హెచ్చరించేవాడని గుర్తుచేసుకున్నాడు. కెప్టెన్‌గా అవసరమైనప్పుడు సహచరులను మందలించడంలో తప్పు లేదని దాదా చెప్పాడు. మరోవైపు 14 ఏళ్ల వయస్సు నుంచే తాను సచిన్‌ ఆటను గమనిస్తూ పెరిగానని తెలిపాడు. ఆ తర్వాత టీమిండియా తరఫున అరంగేట్రం చేశాక సచిన్‌తో కలిసి ఓపెనర్‌గా ఆడడంతోపాటు తమ జోడీ ఎన్నో విజయాలు అందించిందని గుర్తు చేశాడు. తదనంతరం 2000లో జట్టు పగ్గాలు చేపట్టిన గంగూలీ అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకడిగా నిలిచాడు.

Updated Date - 2020-04-28T10:03:46+05:30 IST