అభిమానులకు క్షమాపణలు చెప్పిన ఏబీడీ

ABN , First Publish Date - 2020-11-07T22:27:37+05:30 IST

ఐపీఎల్‌లో భాగంగా నిన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో కోహ్లీ

అభిమానులకు క్షమాపణలు చెప్పిన ఏబీడీ

అబుదాబి: ఐపీఎల్‌లో భాగంగా నిన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో కోహ్లీ సేన దారుణ ఓటమి చవిచూసింది. ఈ పరాజయంతో ఐపీఎల్ నుంచి బెంగళూరు జట్టు నిష్క్రమించింది. ఐపీఎల్ ప్రారంభంలో అదరగొట్టిన ఆర్సీబీ ప్లే ఆఫ్స్ ముంగిట వరుస పరాజయాలు చవిచూసింది. చివరికి అతి కష్టంపై ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది. అయితే, నిన్న జరిగిన ‘డూ ఆర్ డై’ మ్యాచ్‌లో మాత్రం అంచనాలకు తగ్గట్టుగా రాణించలేక చతికిలపడింది. ఫలితంగా ఈసారైనా ట్రోఫీ అందుకోవాలన్న ఆ జట్టు కల కలగానే మిగిలిపోయింది. 


మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్ రూములో ఆటగాళ్ల మధ్య జరిగిన చివరి సంభాషణ వీడియోను ఆర్సీబీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. ఈ వీడియోలో సీనియర్ ఆటగాళ్లు ఏబీ డివిలియర్స్, కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆసీస్ కెప్టెన్ అరోన్ ఫించ్ తదితరులు అభిమానులను, వీక్షకులను నిరాశపరచడంపై ఉద్వేగంగా మాట్లాడారు. డివిలియర్స్ మాట్లాడుతూ.. ఈసారి ఐపీఎల్ కప్పు అందుకోలేకపోతున్నందుకు విచారం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. తమకు అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపాడు. వచ్చే సీజన్‌లో మరింత బలంగా వస్తామని హామీ ఇచ్చాడు. Updated Date - 2020-11-07T22:27:37+05:30 IST