ఆరు రోజులు హోటల్లోనే..

ABN , First Publish Date - 2020-08-22T07:42:09+05:30 IST

ఎడారి దేశంలో ఐపీఎల్‌ సందడి ఊపందుకుంటోంది. ఒకట్రెండు జట్లు మినహా అన్ని ఫ్రాంచైజీలు ఇప్పటికే ప్రత్యేక విమానాల్లో యూఏఈలో అడుగుపెట్టాయి. రాజస్థాన్‌, పంజాబ్‌ క్రికెటర్లు

ఆరు రోజులు హోటల్లోనే..

దుబాయ్‌: ఎడారి దేశంలో ఐపీఎల్‌ సందడి ఊపందుకుంటోంది. ఒకట్రెండు జట్లు మినహా అన్ని ఫ్రాంచైజీలు ఇప్పటికే ప్రత్యేక విమానాల్లో యూఏఈలో అడుగుపెట్టాయి. రాజస్థాన్‌, పంజాబ్‌ క్రికెటర్లు గురువారం రాత్రి దుబాయ్‌ చేరగా, అదేరోజు రాత్రి కోల్‌కతా టీమ్‌ అబుదాబిలో అడుగిడింది. ఎస్‌ఓపీ నిబంధనల్లో భాగంగా రాజస్థాన్‌ జట్టు విమానాశ్రయంలోనే తొలిరోజు పరీక్షలు పూర్తి చేసుకుంది. అన్ని జట్లు కూడా 1,3,6వ రోజుల్లో కొవిడ్‌-19 టెస్టులు చేయించుకోవడం తప్పనిసరి. ఆ తర్వాత బయో బబుల్‌లోకి అడుగుపెట్టి శిక్షణ ఆరంభిస్తారు. ఇక ఇక్కడికి చేరుకున్న ఆటగాళ్లంతా ఆరు రోజుల పాటు హోటల్‌ గదులకే పరిమితం కావాల్సి ఉంటుంది. దీంతో తొలిరోజు కాలక్షేపం కాక.. ఆటగాళ్లు హోటల్‌లోని బాల్కనీని ఫుల్లుగా ఉపయోగించుకున్నారు.


అక్కడి నుంచే సహచర ఆటగాళ్లతో మాటా మంతీ కలిపారు. అయితే ఈ సమయంలోనూ భౌతిక దూరం పాటించడంతో పాటు మాస్కులు పెట్టుకునే ఉన్నారు. మరోవైపు బాల్కనీలతో పాటు ఆటగాళ్లు మాట్లాడుకోవడానికి అవుట్‌డోర్‌ ఏరియాను కూడా వినియోగించుకోవచ్చని ఓ జట్టు వర్గాలు తెలిపాయి. రాజస్థాన్‌ పేసర్‌ ఉనాద్కట్‌ దుబాయ్‌లో తొలిరోజు ఎలా గడిచిందో సోషల్‌ మీడియాలో వీడియో పోస్ట్‌ చేశాడు. ఇందులో ఎయిర్‌ సైకిల్‌తో ఫిట్‌నె్‌సను కాపాడుకుంటూ అతను అవుట్‌డోర్‌ ఏరియాలో యోగా ప్రాక్టీస్‌ చేస్తూ కనిపించాడు. కాగా.. ఇంగ్లండ్ ‌- ఆస్ట్రేలియా జట్ల మధ్య పరిమిత ఓవర్ల సిరీస్‌ కారణంగా ఈ రెండు జట్లలోని ఐపీఎల్‌ ఆటగాళ్లు తొలివారం లీగ్‌కు దూరమయ్యే అవకాశముంది. అయితే అక్కడ కూడా వాళ్లు బయో సెక్యూర్‌లోనే ఉంటారు కాబట్టి యూఏఈకి వచ్చాక మళ్లీ క్వారంటైన్‌లో ఉండాల్సిన అవసరం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే వారంతా ఆరంభం నుంచే ఆడే అవకాశం ఉందని కోల్‌కతా జట్టు పేర్కొంది. ఇదిలా ఉండగా చివరాఖరున సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆదివారం యూఏఈలో అడుగుపెట్టబోతున్నాయి. ప్రస్తుతానికి వీరంతా ముంబైలో ఉన్నారు.


యూఏఈ పయనమైన ధోనీసేన

అందరికంటే ముందుగా వెళతారనుకున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) ఆటగాళ్లు శుక్రవారం భారత్‌ను వీడారు. ఈమేరకు ఆయా ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్ల ఫొటోలను ట్విటర్‌లో పోస్ట్‌ చేశాయి. ఆర్‌సీబీ కూడా చార్టెడ్‌ ఫ్లయిట్స్‌లో ఉన్న తమ ప్లేయర్ల గ్రూపు ఫొటోను షేర్‌ చేసింది. అయితే ముఖానికి మాస్క్‌, షీల్డులు ధరించిన వీరిని గుర్తుపట్టడం అభిమానులకు కష్టమవుతోంది. చాహల్‌, పార్థివ్‌ సులువుగానే తెలుస్తున్నా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అందులో ఉన్నాడా.. లేడా అనేది సస్పెన్స్‌ కలిగించింది. అందుకే కోహ్లీ ఎక్కడ? అని అభిమానులు ప్రశ్నించారు. కాగా, తాను దుబాయ్‌లోనే ఉన్న ఫొటోను విరాట్‌ తొలుత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేయగా.. అదే విషయాన్ని జట్టు మేనేజ్‌మెంట్‌ ట్విటర్‌ ద్వారా ధ్రువీకరించింది.


పకడ్బందీ చర్యలతో..

ముంబై ఇండియన్స్‌ జట్టు తమ ఆటగాళ్ల కోసం పకడ్బందీ చర్యలు తీసుకుంది. ప్రయాణంలో అందరికీ పీపీఈ కిట్లను అందించింది. ఈమేరకు వాటిని ధరించిన ఆటగాళ్లు ప్రత్యేకంగా కనిపించారు. ఈ డ్రెస్‌తో హార్దిక్‌ పాండ్యా తన సోదరుడు క్రునాల్‌ పాండ్యాతో కలిసి దిగిన ఫొటో ఆకట్టుకుంది. ఇక ప్రయాణానికి ముందు ముంబై కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు తన ముద్దుల కూతురు సమైరా కిట్‌ను సర్దడంలో సహాయపడింది. ఇందుకు సంబంధించిన ఫొటోను అతను ఇన్‌స్టాలో షేర్‌ చేశాడు. 


బయో బబుల్‌తో వారికి కష్టమే..

ముంబై: కరోనా నేపథ్యంలో ఆటగాళ్లంతా బయో బబుల్‌లో ఉంటారు కాబట్టి ఈసారి మ్యాచ్‌ ఫిక్సర్లకు కష్టమేనని బీసీసీఐ ఏసీయూ చీఫ్‌ అజిత్‌ సింగ్‌ తెలిపాడు. ‘ఈ పద్దతిలో ఆటగాళ్లతో ఇతరులు మాట్లాడడానికి వీలుండదు. మాకు కూడా పర్యవేక్షణ చాలా సులువవుతుంది. ప్లేయర్స్‌ ట్విటర్‌ పోస్టుల్లోనూ ఏమైనా కోడ్‌ సందేశాలున్నాయా అని పరిశీలిస్తాం. అలాగే 53 రోజుల పాటు జరిగే ఈ టోర్నీ కోసం ప్రతీ జట్టు తరఫున ఇద్దరు అనుసంధాన అధికారులు ఉంటారు’ అని అజిత్‌ వెల్లడించాడు. 

Updated Date - 2020-08-22T07:42:09+05:30 IST