ఉబెర్‌కప్ నుంచి సింధు అవుట్
ABN , First Publish Date - 2020-09-03T09:47:47+05:30 IST
ప్రతిష్ఠాత్మక థామస్, ఉబెర్ కప్ ఫైనల్స్ నుంచి ప్రపంచ చాంపియన్ పీవీ సింధు వైదొలిగింది.

వ్యక్తిగత కారణాలతో వైదొలిగినట్టు ప్రకటన
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ప్రతిష్ఠాత్మక థామస్, ఉబెర్ కప్ ఫైనల్స్ నుంచి ప్రపంచ చాంపియన్ పీవీ సింధు వైదొలిగింది. వ్యక్తిగత కారణాల రీత్యా సింధు ఈ టోర్నీలో ఆడడం లేదని ఆమె తండ్రి రమణ బుధవారం మీడియాకు వెల్లడించారు. ఈ విషయాన్ని భారత బ్యాడ్మింటన్ సంఘాని(బాయ్)కి తెలియజేశామని ఆయన చెప్పారు. దీంతో సుదీర్ఘ విరామం తర్వాత సింధు రాకెట్ విన్యాసాలు చూద్దామనుకున్న అభిమానులకు నిరాశే ఎదురైంది. షెడ్యూల్ ప్రకారం వచ్చే నెల 3 నుంచి 11 వరకు డెన్మార్క్ వేదికగా థామస్, ఉబెర్ కప్ జరగనుంది. కొవిడ్ అనంతరం జరుగుతున్న తొలి అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఇదే. ఈ టోర్నీ ప్రారంభ సమయంలోసింధు కొన్ని కుటుంబ పూజా కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉండడంతో ఆమె ఆడలేకపోతోందని రమణ తెలిపారు.
ఉబెర్‌కప్ ముగిసిన వెంటనే జరగనున్న డెన్మార్క్ ఓపెన్, డెన్మార్క్ మాస్టర్స్ టోర్నీలకు ఎంట్రీ దరఖాస్తులు పంపుతామని.. అయితే, అప్పటి పరిస్థితులను బట్టి అందులో ఆడాలా వద్దా అన్నదానిపై సింధు నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఒలింపిక్స్ ప్రాబబుల్స్‌లో ఉన్న సింధు ప్రస్తుతం హైదరాబాద్‌లోని సాయ్-గోపీచంద్ అకాడమీలో చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్, కొరియా కోచ్ పార్క్ టె సాంగ్ పర్యవేక్షణలో సాధన చేస్తోంది. కాగా.. వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత సాయి ప్రణీత్ కూడా థామస్ కప్‌లో ఆడడం అనుమానంగా మారింది. ‘ఈ మధ్యనే సాధన మొదలుపెట్టా. పూర్తి ఫిట్నెస్ సాధించినట్టు అనిపిస్తేనే టోర్నీలో పాల్గొంటా’ అని ప్రణీత్ తెలిపాడు.