‘పసిడి’ కోసం పరితపించా!
ABN , First Publish Date - 2020-04-25T09:45:39+05:30 IST
గత ఏడాది జరిగిన వరల్డ్ చాంపియన్‌షిప్ తన కెరీర్‌లో ఎంతో ప్రత్యేకమైనదని ఏస్ షట్లర్ పీవీ సింధు తెలిపింది. మహిళా క్రికెటర్లు స్మృతీ ...

అప్పటికే సిల్వర్ సింధు అనేశారు
దాన్ని తిరగరాయాలని భావించా
2019 ప్రపంచ చాంపియన్‌షి్‌పపై సింధు
హైదరాబాద్: గత ఏడాది జరిగిన వరల్డ్ చాంపియన్‌షిప్ తన కెరీర్‌లో ఎంతో ప్రత్యేకమైనదని ఏస్ షట్లర్ పీవీ సింధు తెలిపింది. మహిళా క్రికెటర్లు స్మృతీ మంధాన, జెమీమా రోడ్రిగ్స్ ‘డబుల్ ట్రబుల్’ పేరిట ఓ కొత్త వెబ్ షో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తొలి అతిథిగా ప్రపంచ చాంపియన్ సింధు పాల్గొంది. ఈ సందర్భంగా సింధు తన మనసులోని భావాలను దాపరికం లేకుండా పంచుకొంది. ‘2019 వరల్డ్ చాంపియన్‌షి్‌పను నేను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటా. అప్పటికే ఈ టోర్నీలో నేను రెండు రజతాలు, రెండు కాంస్యాలు గెలుపొందా. ఇక, ఫైనల్ చేరడం రెండోసారి. ఈసారి ఫైనల్లో కచ్చితంగా విజయం సాధించాలని అనుకున్నా’ అని సింధు వెల్లడించింది. ఒకవేళ ఓడిపోతే తాను ఏమిచేసే దానినో కూడా తెలియదని పేర్కొంది. ‘ఇకపై ప్రజలు నన్ను ‘సిల్వర్ సింధు’ అని పిలవకూడదు. అందుకే ఫైనల్ ముందు బాగా ఆడాలి..బాగా ఆడాలి..ఎలాగైనా సరే విజయం సాధించాలని అనుకున్నా’ అని తెలిపింది. తుది సమరంలో ఒకుహరాను చిత్తు చేసిన సింధు..వరల్డ్ చాంపియన్‌షి్‌పలో స్వర్ణం అందుకున్న తొలి భారత షట్లర్‌గా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ‘మ్యాచ్ గెలిచాక నా స్పందన ఎలా ఉండాలో..చివరి పాయింట్‌కు ముందే నిర్ణయించుకున్నా. కానీ, విజయం సాధించాక అనుకున్న దానికంటే భిన్నంగా స్పందించా’ అని సింధు పేర్కొంది. 2012 చైనా మాస్టర్స్‌లో అప్పటి ఒలింపిక్ చాంపియన్ లీ జురైని ఓడించడం కూడా తన కెరీర్‌లో మరో గొప్ప సంఘటనగా చెప్పింది. ఆ మ్యాచ్‌లో సింధు 21-19, 9-21, 21-16తో జురైపై నెగ్గింది.