ధోనీ చేసింది చాలు.. హుందాగా రిటైర్మెంట్ ప్రకటిస్తే మేలు: అక్తర్
ABN , First Publish Date - 2020-04-12T19:05:41+05:30 IST
టీం ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్ గురించి పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ధోనీ తన కెరీర్‌ని చాలా
టీం ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్ గురించి పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ధోనీ తన కెరీర్‌ని చాలా సాగదీస్తున్నాడని పేర్కొన్న ఆయన.. 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తే హుందాగా ఉండేదని అభిప్రాయపడ్డారు.
‘‘ధోనీ దేశానికి ఎంతో సేవ చేశాడు. ఇక హుందాగా క్రికెట్‌కి వీడ్కోలు చెప్పాలి. అసలు తను ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నాడో తెలియడం లేదు. ప్రపంచకప్ ముగిసిన వెంటనే రిటైర్మెంట్ ప్రకటిస్తే బాగుండేది. నేను అతని స్థానంలో ఉంటే ఎప్పుడో రిటైర్మెంట్ ప్రకటించేవాడిని. 2011 ప్రపంచకప్ తర్వాత మరో మూడు-నాలుగు సంవత్సరాలు నాకు ఆడే అవకాశం ఉంది. కానీ, అప్పుడు నాకు ఆ సామర్థ్యం లేదని అనిపించింది. దాంతో నేను ఆలస్యం చేయలేదు’’ అని అక్తర్ పేర్కొన్నారు.
వన్డే ప్రపంచకప్ తర్వాత క్రికెట్ నుంచి విరామం తీసుకున్న ధోనీ.. ఐపీఎల్లో మళ్లీ మైదానంలో కనిపిస్తాడని అంతా భావించారు. కానీ, కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఆ టోర్నమెంట్ వాయిదా పడింది. మళ్లీ టోర్నమెంట్ ఎప్పుడు జరుగుతుందనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు ధోనీ ఐపీఎల్లో చేసే ప్రదర్శన ఆధారంగానే అతన్ని మళ్లీ జట్టులోకి తీసుకుంటారనే విషయం విదితమే. ఒకవేళ ఐపీఎల్ జరగని నేపథ్యంలో అతనికి టీ-20 ప్రపంచకప్ జట్టులో అవకాశం దొరుకుతుందా..? లేదా..? అనే ప్రశ్న కూడా అభిమానులను కలవర పెడుతోంది. కాబట్టి ఇప్పటికైనా.. జట్టు సభ్యులు, యాజమాన్యం ధోనీకి హుందాగా వీడ్కోలు చెప్పాలని అక్తర్ అన్నారు.
‘‘ఇప్పటికైనా.. అతనికి మర్యాదపూర్వకంగా, హుందాగా వీడ్కోలు ఇవ్వాలి. అతను ప్రపంచకప్‌తో పాటు ఎన్నో అద్భుత విజయాలను దేశానికి అందించాడు. అతను చాలా మంచి వ్యక్తి. సెమీఫైనల్లో (న్యూజిలాండ్‌తో జరిగిన) అతను మ్యాచ్‌ని గెలిపించలేకపోయాడు. అప్పుడు ఎందుకు రిటైర్ అవ్వలేదనే సమాధానం అతనికే తెలియాలి. ప్రపంచకప్ తర్వాత ధోనీ కోసం ఒక సిరీస్‌ను పెట్టి.. ఆ తర్వాత అతనికి వీడ్కోలు చెప్పి ఉంటే హుందాగా ఉండేది’’ అని అక్తర్ అభిప్రాయపడ్డారు.