ఆ విషయంలో ధోనీ నాకు స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చాడు: షమి

ABN , First Publish Date - 2020-05-10T22:14:10+05:30 IST

అంతర్జాతీయ క్రికెట్ జట్టుకు కెప్టెన్సీ వహించడం అంటే సాధారణ విషయం కాదు. ఇక భారత్ క్రికెట్ అంటే ఆట కాదు...

ఆ విషయంలో ధోనీ నాకు స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చాడు: షమి

న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్ జట్టుకు కెప్టెన్సీ వహించడం అంటే సాధారణ విషయం కాదు. ఇక భారత్ క్రికెట్ అంటే ఆట కాదు ఓ మతం. ఇలాంటి దేశానికి ప్రాతినిథ్యం వహిస్తూ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించడం అంటే అది కత్తి మీద సాములాంటిదే. ఆ ఒత్తిడిలో తోటి ఆటగాళ్లను తిడుతూ, కోప్పడుతూ కెప్టెన్లు నానా హంగామా చేస్తుంటారు. కానీ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మాత్రం అలా కాదు. ఆటగాళ్లపై కోప్పడి దాఖలాలు లేవు. ఇక వాళ్లను తిట్టడం అటుంచితే అరిచిన సందర్భాలూ చాలా తక్కువ. అయితే తప్పు చేసిన ఆటగాళ్లను మహీ ఏమీ అనడా..? అంటే.. అలా ఏం కాదు.. వారి దగ్గరకు వచ్చి మాటలతోనే వారికి దిశానిర్దేశం చేస్తాడు. ఇలాంటి ఓ అనుభవాన్నే పేసర్ మహమ్మద్ షమి ఇటీవల ఇన్‌స్టాగ్రాం లైవ్‌లో పంచుకున్నాడు. 2014లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లోని ఓ సంఘటనను షమీ వివరించాడు. "వెల్లింగ్టన్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌ సందర్భంగా నా బౌలింగ్‌లో 14 పరుగుల వద్ద మెక్‌కలమ్ ఇచ్చిన క్యాచ్‌ను కోహ్లీ పట్టుకోలేకపోయాడు. అయితే ఏం పర్లేదులే మళ్లీ అవుట్ చేయచ్చు అనుకున్నాం. కానీ మెక్‌కల్లమ్ రెండో రోజు వరకు బ్యాటింగ్ చేసి తన కెరీర్‌లోనే బెస్ట్ స్కోర్ 302 పరుగులు చేశాడు.


ఈ దశలో మళ్లీ నా బౌలింగ్‌లోనే మరో బ్యాట్స్‌మెన్ క్యాచ్ కూడా నేలపాలైంది. దీంతో నేను అసహనానికి గురయ్యా. ఆ ఫ్రస్ట్రేషన్‌లో ఓ భారీ బౌన్సర్ వేశా. అది కీపర్ ధోనీ తలపైనుంచి బౌండరీకి వెళ్లిపోయింది. ఆ సెషన్‌కు అదే చివరి బంతి. అందరం డ్రెస్సింగ్ రూంకు తిరిగి వెళ్లిపోతున్నాం. ఆ సమయంలో ధోనీ నా దగ్గరకు వచ్చి నా భుజంపై చెయ్యి వేసి ‘క్యాచ్ మిస్సవ్వడం అటుంచితే.. నువ్వు చివరి బంతిని సరిగా వేసి ఉండాల్సింది’ అని అన్నాడు. నేను చెయ్యి జారిపోయిందని చెప్పా.


ఈ సారి నన్ను మరింత గట్టిగా పట్టుకున్నాడు. ‘చూడు.. నీలాంటి వాళ్లని చాలా మందిని చూశా.. అందరూ వచ్చారు.. ఆడారు.. వెళ్లిపోయారు.. నాకు అబద్ధాలు చెప్పేందుకు ప్రయత్నించకు. నేను నీ కెప్టెన్‌ని. నీకంటే సీనియర్‌ని. ఇంకెవరినైనా ఫూల్ చెయ్యి. నన్ను కాదు’ అని అన్నాడు. దాంతో నేను ఇంకేం మాట్లాడలేదు" అంటూ షమీ చెప్పాడు. ధోనీ అతడు గొప్ప వ్యక్తిత్వం గల వ్యక్తని, అతడి నుంచి చాలా నేర్చుకోవచ్చని అన్నాడు. మూడు ఫార్మాట్లలోకి ధోనీ కెప్టెన్సీలోనే తాను అడుగుపెట్టానని, దానివల్ల ఎంతో నేర్చుకున్నానని షమీ చెప్పుకొచ్చాడు.

Updated Date - 2020-05-10T22:14:10+05:30 IST