రాణిస్తే వారి ప్రతిభ.. విఫలమైతే మావల్ల!

ABN , First Publish Date - 2020-05-08T09:52:34+05:30 IST

‘మ్యాచ్‌లలో మా భర్తలు రాణిస్తే అది వారి ప్రతిభగా కీర్తిస్తారు. అదే విఫలమైతే మేమే కారణమని నిందిస్తారు’ అని అనుష్క, తనను దృష్టిలో ...

రాణిస్తే వారి ప్రతిభ.. విఫలమైతే మావల్ల!

సానియా మీర్జా

న్యూఢిల్లీ: ‘మ్యాచ్‌లలో మా భర్తలు రాణిస్తే అది వారి ప్రతిభగా కీర్తిస్తారు. అదే విఫలమైతే మేమే కారణమని నిందిస్తారు’ అని అనుష్క, తనను దృష్టిలో పెట్టుకొని టెన్నిస్‌ ఏస్‌ సానియా మీర్జా పేర్కొంది. భారత మహిళా జట్టు స్టార్లు స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్‌ యూ ట్యూబ్‌ చాట్‌ షో ‘డబుల్‌ ట్రబుల్‌’లో సానియా గురువారం మాట్లాడింది. ఈ సందర్భంగా గత మార్చిలో భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య మహిళల టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌ను పురస్కరించుకొని తాను చేసిన ఓ ట్వీట్‌ను సానియా ప్రస్తావించింది. ఆ ఫైనల్లో..తన భార్య అలీసా హీలీకి మద్దతు పలికేందుకు దక్షిణాఫ్రికాతో వన్డే మ్యాచ్‌ నుంచి వైదొలగిన ఆస్ట్రేలియా పేసర్‌ మిచెల్లి స్టార్క్‌ స్వదేశం వచ్చేశాడు. దాంతో ‘జోరు కా గులామ్‌’ అని సానియా చేసిన కామెంట్‌ పెద్ద ఎత్తున వైరల్‌ అయింది. ఆ ట్వీట్‌ ఉద్దేశమేమిటని స్మృతి, జెమీమా సానియాను అడిగారు. ‘ఉపఖండంలో అయితే అలా చేసిన వ్యక్తిని భార్యా విధేయుడు (జోరు కా గులామ్‌) అంటారు’ అని ఆమె వివరించింది. ‘అది సరదాగా చేసిన ట్వీట్‌. నాకు, అనుష్క శర్మకు ఆ ట్వీట్‌తో సంబంధం ఉంది’ అని సానియా తెలిపింది. గతంలో విరాట్‌ కోహ్లీ, షోయబ్‌ మాలిక్‌ బ్యాటింగ్‌లో విఫలమైనప్పుడు దానికి అనుష్క, సానియాలే కారణమంటూ సోషల్‌ మీడియాలో విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.

Updated Date - 2020-05-08T09:52:34+05:30 IST