అమ్మలందరికీ లేఖ.. టెన్నిస్ స్టార్ సానియా పోస్ట్!

ABN , First Publish Date - 2020-11-27T19:48:30+05:30 IST

సానియా మీర్జా.. ఈమె పేరు తెలియని వారు ఉండటం చాలా అరుదు. భారత్ తరఫున ఆరుసార్లు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించి, భారతీయ అమ్మాయిల టెన్నిస్ రాకెట్లు పట్టుకోవడంతో సానియా పాత్ర చాలా ఉంది.

అమ్మలందరికీ లేఖ.. టెన్నిస్ స్టార్ సానియా పోస్ట్!

ఇంటర్నెట్ డెస్క్: సానియా మీర్జా.. ఈమె పేరు తెలియని వారు ఉండటం చాలా అరుదు. భారత్ తరఫున ఆరుసార్లు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించి, భారతీయ అమ్మాయిల టెన్నిస్ రాకెట్లు పట్టుకోవడంతో సానియా పాత్ర చాలా ఉంది. పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను ఆమె వివాహమాడటం కూడా పెద్ద దుమారం రేపిన వార్తే. ఆమె ఇప్పుడు ప్రపంచంలోని తల్లులందరికీ ఓ లేఖ రాసింది. ఈ లేఖ ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. కెరీర్, కుటుంబం గురించి తన లేఖలో ప్రస్తావించిన సానియా.. చాలా విషయాలు చెప్పింది. ‘‘సానియా మీర్జా, ఎ మదర్ అండ్ ఎ టెన్నిస్ ప్లేయర్’’ రాసినట్లుగా ఆమె ఈ లేఖ చివర్న సంతకం చేశారు.


పరిచయం అక్కర్లేని ఈ టెన్నిస్ స్టార్.. ప్రపంచంలోని తల్లులందరికీ ‘‘ఓడ్ టు ఆల్ మదర్స్’’ పేరుతో ఓ లేఖ రాసింది. ఈ లెటర్‌లో ఆమె చాలా విషయాలు ప్రస్తావించింది. తన కెరీర్ గురించి, తనకు స్ఫూర్తిగా నిలిచిన వారి గురించి కూడా వివరించింది. కుటుంబం, వ్యక్తిగత గమ్యాలను బ్యాలెన్స్ చేసుకోవడంపై మాట్లాడింది. ఈ లేఖ చాలామంది సానియా ఫ్యాన్స్‌ను కదిలించిందట. కుటుంబంలో అమ్మాయి పుడితే.. క్రీడాకారిణిని చేయాలని చాలామంది అనుకోరని సానియా చెప్పింది. అసలు ఆ ఆలోచనే వారికి రాదని తెలిపింది. అయితే ఇలాంటి సమయాల్లో కూడా మన కోరికను చంపుకోకూడదని ఆమె చెప్పింది. ‘‘ఎప్పుడైతే ఇది నేను చేయగలనా? చేయలేనేమో? అనే అనుమానం మనకు వస్తుందో.. ఇక అంతే. అక్కడి నుంచి ముందుకెళ్లడం చాలా కష్టం’’ అని సానియా పేర్కొంది.




కుమారుడు ఇజాన్ మిర్జీ మాలిక్‌కు జన్మనిచ్చిన తర్వాత కూడా సానియాకు టెన్నిస్‌పై మక్కువ చావలేదు. 2018లో ఆమె కుమారుడికి జన్మనిచ్చింది. మళ్లీ టెన్నిస్‌లోకి పునరాగమనం చేయాలని తపించిన సానియా.. ఎట్టకేలకు రెండేళ్ల తర్వాత మళ్లీ రాకెట్ పట్టుకొని కోర్టులోకి దిగింది. అద్భుతంగా రాణించి హోబర్ట్ ఇంటర్నేషనల్ వుమెన్స్ డబుల్ టైటిల్ సాధించింది. ఈ విజయం తన జీవితంలోనే అద్భుతమైన అనుభూతని సానియా చెప్పింది. గర్భంతో ఉన్నప్పుడు 23 కేజీల బరువు పెరిగానని, మళ్లీ వెయిట్ తగ్గి ఆడటం సాధ్యమేనా? అనే అనుమానం కూడా తనకు వచ్చిందని చెప్పింది. అయితే కష్టపడి వర్కవుట్స్ చేసి 26 కేజీలు బరువు తగ్గి, మళ్లీ ఆడటం ప్రారంభించినట్లు వెల్లడించింది.


టెన్నిస్‌లో తనకు అమెరికా నల్లకలువ సెరెనా విలియమ్స్ స్ఫూర్తి అని సానియా తెలిపింది. సెరెనా కూడా పిల్లలు పుట్టిన తర్వాత టెన్నిస్ ఆడి అద్బుతంగా రాణిస్తోంది. ‘‘సెరెనా ఆడే సమయంలోనే ఆడుతున్న నాకు.. ఆమెపై వచ్చిన డాక్యుమెంటరీ చూస్తే ఆ అనుభూతే కొత్తగా అనిపించింది. ఆమెను కళ్లెదుటే చూస్తున్నట్లు అనిపించింది. ఆమె గురించి చాలా విషయాలు ఈ డాక్యుమెంటరీలో కనిపించాయి’’ అని సానియా చెప్పింది. ఎన్నో ఘనతలు సాధించినా కూడా ఇంకా ఏదో సాధించాలన్న తపన సెరెనాలో తనను కట్టి పడేసిందని సానియా పేర్కొంది.


భారత అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మ భూషణ్ కూడా సానియాను వరించింది. గర్భం దాల్చడం గురించి కూడా సానియా లేఖలో ప్రస్తావించింది. ప్రతి అమ్మాయీ కచ్చితంగా గర్భం దాల్చాలని ఆమె సూచించింది. ‘‘ఒకసారి మన కడుపులో మరో ప్రాణం ఉందని తెలిస్తే ఆ అనుభూతే వేరు. ఇది మనకు స్వార్ధం లేని ప్రేమను పరిచయం చేస్తుంది. ఇలాంటి ప్రేమ నాపై ఎవరికైనా ఉంటుందని నేనెప్పుడూ కనీసం ఊహించలేదు కూడా’’ అని సానియా చెప్పింది. ఇలా ఓ బిడ్డకు జన్మనివ్వడం తనను కూడా వ్యక్తిగా మరో మెట్టు పైకి ఎక్కించినట్లు సానియా ఫీలవుతోందట. ఈ విషయాలన్నీ పూస గుచ్చినట్లు చెప్తూ సానియా రాసిన లేఖ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీన్ని ఇప్పటికే సుమారు 60వేల మంది లైక్ చేశారు. ఈ లేఖపై హీరోయిన్ సమంత, సింగర్ నీతి మోహన్, ధోనీ భార్య సాక్షి వంటి సెలెబ్రిటీలు కూడా స్పందించారు.

Updated Date - 2020-11-27T19:48:30+05:30 IST