నా కారు వెతికి పెట్టండి.. ఫ్యాన్స్‌ను కోరిన సచిన్

ABN , First Publish Date - 2020-08-20T21:29:52+05:30 IST

క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తన ఫ్యాన్స్‌ను ఓ చిరు కోరిక కోరారు. తన పాత కారును..

నా కారు వెతికి పెట్టండి.. ఫ్యాన్స్‌ను కోరిన సచిన్

ముంబై: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తన ఫ్యాన్స్‌ను ఓ చిరు కోరిక కోరారు. తన పాత కారును వెతికి పెట్టమని అభ్యర్థించారు. అంతర్జాతీయ క్రికెట్‌లోకి తాను అడుగు పెట్టిన తొలినాళ్ళలో మారుతీ 800 కారును కొనుగోలుచేశానని, అదే తన మొదటి కారని సచిన్ తెలిపారు. అయితే ప్రస్తుతం ఆ కారు తన వద్ద లేదని, ఎలాగైనా ఆ కారును వెతికి పెట్టమని అభిమానులను కోరారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సచిన్ క్రికెట్‌కు సంబంధించి తన అనుభవాలను అభిమానులతో పంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే తన తొలి కారు గురించి వివరించారు. ‘నేను తొలి సారిగా కొన్న కారు మారుతీ 800. అయితే అది ఇప్పుడు నా దగ్గర లేదు. దాన్ని ఎలాగైనా వెతికి పెట్టండి. ఆ కారు ఎవరి దగ్గర ఉందో గుర్తించి వారి వివరాలు తెలియజేయండి. ఆ కారును తిరిగి సంపాదించాలనుకుంటున్నా. సాయం చేయండ’ని సచిన్ కోరారు. తనకు కార్లంటే ఎంతో ఇష్టమని, ఇంటి బాల్కనీ నుంచి ప్రతిరోజు రోడ్డుపై తిరిగే కార్లను తన అన్నతో కలిసి చూస్తూ ఉండే వాడినని చెప్పారు. ఆ తరువాత ఎన్నో కార్లను కొనుగోలు చేశానని, కాని తన తొలికారు లేదనే బాధ మాత్రం మిగిలిపోయిందని సచిన్ పేర్కొన్నారు.

Updated Date - 2020-08-20T21:29:52+05:30 IST