తొలి టెస్టే చివరిదనుకున్నా!
ABN , First Publish Date - 2020-04-26T10:11:09+05:30 IST
టీనేజి వయస్సులోనే అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తదనంతరం పాతికేళ్ల పాటు వెనుదిరిగి ...

రవిశాస్త్రి సలహా పని చేసింది జూ టెండూల్కర్
ముంబై: టీనేజి వయస్సులోనే అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తదనంతరం పాతికేళ్ల పాటు వెనుదిరిగి చూసింది లేదు. ఏకంగా ‘క్రికెట్ గాడ్’గా పిలిపించుకుని సగర్వంగా ఆట నుంచి వైదొలిగాడు. ఈ క్రమంలో తను సృష్టించిన రికార్డులు కోకొల్లలు. అయితే, క్రికెట్‌లో తొలి అడుగు మాత్రం చాలా కష్టంగా పడిందని మాస్టర్ గుర్తు చేసుకున్నాడు. 1989లో పాకిస్థాన్‌తో టెస్టు సిరీస్ ద్వారా సచిన్ అరంగేట్రం చేశాడు. ఆ సమయంలో ఇమ్రాన్ ఖాన్, వసీం అక్రమ్, వకార్ యూని్‌సతో కూడిన అత్యద్భుత పేస్ దళం పాక్ పక్షాన ఉంది.
అందుకే 16 ఏళ్ల వయస్సులో వారిని ఎదుర్కోవడం సచిన్ వల్ల కాలేదు. బంతులన్నీ నేరుగా శరీరానికి తాకుతుండగా నొప్పిని భరిస్తూ తొలి ఇన్నింగ్స్‌లో కష్టంగా 15 పరుగులు చేయగలిగాడు. అంతే.. ఇక, ఈ మ్యాచ్ తర్వాత తనకు కెరీర్ ఉండదని, ఇదే చివరి మ్యాచ్ కావచ్చని భావించాడట. కానీ ఇలాంటి పరిస్థితిలో రవిశాస్త్రి ఇచ్చిన సలహా కారణంగానే తాను నిలదొక్కుకోగలిగానని సచిన్ చెప్పాడు. ‘పాక్‌తో తొలి టెస్టులో నేను స్కూల్ మ్యాచ్ తరహాలో ఆడాననిపించింది. నాకేమీ అర్థం కాని పరిస్థితిలో ఉండిపోయా. వసీం, వకార్‌ల పదునైన షార్ట్ పిచ్ బంతులకు ఎలా ఆడాలో తెలీలేదు. ఎందుకంటే అప్పటి వరకు అలాంటి బంతులను ఎదుర్కోలేదు. అంతా కొత్తగా తోచింది. అందుకే తొలి ఇన్నింగ్స్‌లో 15 పరుగులకే అవుటయ్యాక నేరుగా బాత్‌రూమ్‌లోకి వెళ్లి ఏడ్చేశా. అంతర్జాతీయ స్థాయికి నేను పనికిరానని భావించా. ఈ విషయం సహచరులకు తెలిసి ఓదార్చారు. అప్పుడే నాతో రవిశాస్త్రి మాట్లాడాడు. నీవు ప్రపంచ అత్యుత్తమ బౌలర్లను ఎదుర్కొన్నావని, వారి సామర్థ్యం, నైపుణ్యాన్ని గౌరవించాలని చెప్పాడు. అలాగే వారి బౌలింగ్‌లో పరుగులు చేయలేనని బాధ పడకుండా క్రీజులో అర్ధగంట సమయం గడపాలని సూచించాడు. దీంతో వారి పేస్ నీకు అర్థమవుతుందని చెప్పాడు. ఈ చిట్కా నిజంగా అద్భుతంగా పని చేసింది. ఫైసలాబాద్‌లో జరిగిన రెండో టెస్టులో నేను స్కోరు బోర్డు వైపు కాకుండా గడియారం వైపే చూశా. అర్ధగంట అయ్యాక సౌకర్యంగా అనిపించింది. ఆ మ్యాచ్‌లో నేను 59 పరుగులు సాధించా. ఇక, ఆ తర్వాత పరిస్థితులు నాకు అనుకూలంగా మారాయి’ అని ‘నాసిర్ మీట్స్ సచిన్’ అనే కార్యక్రమంలో టెండూల్కర్ వివరించాడు.