విజేత హరికృష్ణ

ABN , First Publish Date - 2020-07-20T09:05:51+05:30 IST

తెలుగు గ్రాండ్‌మాస్టర్‌ పెంటేల హరికృష్ణ బీల్‌ చెస్‌ 960 టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. లాక్‌డౌన్‌ తర్వాత జరిగిన ముఖాముఖీ చెస్‌ పోటీల్లో టైటిల్‌ ...

విజేత హరికృష్ణ

‘చెస్‌ 960 టైటిల్‌’ కైవసం 

స్పీడ్‌ చెస్‌-4 రన్నరప్‌ హంపి


బీల్‌ (స్విట్జర్లాండ్‌): తెలుగు గ్రాండ్‌మాస్టర్‌ పెంటేల హరికృష్ణ బీల్‌ చెస్‌ 960 టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. లాక్‌డౌన్‌ తర్వాత జరిగిన ముఖాముఖీ చెస్‌ పోటీల్లో టైటిల్‌ నెగ్గిన తొలి భారత ఆటగాడు హరికృష్ణే కావడం విశేషం. ఆదివారం ముగిసిన ఫిషర్‌ రాండమ్‌ ఫార్మాట్‌లో హరికృష్ణ 5.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి టైటిల్‌ కొట్టేశాడు. ఐదు పాయిం ట్లతో ద్వితీయ స్థానాన్ని దక్కించుకున్న జర్మనీ గ్రాండ్‌మాస్టర్‌ విన్‌సెంట్‌ కీమెర్‌ టైటిల్‌ రేసులో హరికృష్ణకు గట్టి పోటీ ఇవ్వగా పోలెండ్‌ జీఎం రాడోస్లావ్‌ వొజ్‌టాజెక్‌ (4.5) తృతీయ స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఏడు రౌండ్ల పాటు సాగిన ఈ పోటీల్లో మైకేల్‌ ఆడమ్‌ (ఇంగ్లండ్‌)తో జరిగిన తొలి రౌండ్‌ను హరి డ్రాగా ముగించాడు. ఆ తర్వాతి రెండు రౌండ్లలో స్విట్జర్లాండ్‌ జీఎమ్‌లు డాన్‌చెంకో, నొయిల్‌పై నెగ్గిన హరికృష్ణ ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. కీమెర్‌, వొజ్‌ టాజెక్‌తో జరిగిన నాలుగైదు రౌండ్లను డ్రా చేసుకోగా చివరి రెండు రౌండ్లలో విజృంభించి ఆడిన తెలుగుతేజం విజేతగా నిలిచాడు. ఇక, ఈ చెస్‌ ఫెస్టివల్‌లో మిగిలిన ర్యాపిడ్‌ పోటీలు సోమవారం, బ్లిట్జ్‌ పోటీలు 25న మొదలవనున్నాయి.

రన్నరప్‌గా హంపి

మహిళల స్పీడ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌ 4వ గ్రాండ్‌ ప్రీలో తెలుగు గ్రాండ్‌ మాస్టర్‌ కోనేరు హంపి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్‌లో రష్యా జీఎం అలెగ్జాండ్రా కోస్తానిక్‌ చేతిలో 7-5 తేడాతో హంపి పరాజయం పాలైంది. స్పీడ్‌ చెస్‌ నాలుగు గ్రాండ్‌ ప్రీలు ముగిసేసరికి హంపి పది పాయింట్లతో 7వ స్థానంలో నిలిచింది. ఇక, ఓవ రాల్‌గా తొలి రెండు స్థానాలను దక్కించుకున్న కోస్టానిక్‌ (24 పాయింట్లు)-ఉక్రెయిన్‌ జీఎం అన్నా ఉషెనినా (22 పాయింట్లు) మధ్య సోమవారం స్పీడ్‌ చెస్‌ సూపర్‌ ఫైనల్‌ జరగనుంది.

వినూత్నంగా.. 

కొవిడ్‌-19 దృష్ట్యా నిర్వాహకులు పలు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇందులో భాగంగా చెస్‌ బోర్డు మధ్యలో ఆటగాళ్ల ముఖం ఎత్తు వరకు ఒక అద్దాన్ని ఏర్పాటు చేశారు. బోర్డుపై చేతులతో చెస్‌ పావులను కదిపేందుకు మాత్రం వీలుగా అద్దం కింద ఖాళీ ఉంచారు. ఆట ముగియగానే చెస్‌ బోర్డు, పావులను శుభ్రం చేస్తున్నారు.

Updated Date - 2020-07-20T09:05:51+05:30 IST