టీ20 ఫైనల్లో రోహిత్ బాదుడు ఎవరికైనా గుర్తుందా..: యువరాజ్
ABN , First Publish Date - 2020-07-28T01:31:31+05:30 IST
2007 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ అనగానే ధోనీ కెప్టెన్సీ.. గంభీర్ బ్యాటింగ్.. జోగీందర్ శర్మ బౌలింగ్.. శ్రీశాంత్ క్యాచ్.. ఇవే మనకు గుర్తొస్తాయి. కానీ యువరాజ్ సింగ్ మాత్రం...

చండీఘర్: 2007 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ అనగానే ధోనీ కెప్టెన్సీ.. గంభీర్ బ్యాటింగ్.. జోగీందర్ శర్మ బౌలింగ్.. శ్రీశాంత్ క్యాచ్.. ఇవే మనకు గుర్తొస్తాయి. కానీ యువరాజ్ సింగ్ మాత్రం ఆ మ్యాచ్ గెలవడానికి రోహిత్ శర్మ చివర్లో చెలరేగి ఆడడమే కారణమని అంటున్నాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న యువరాజ్ 2007 టీ20 ప్రపంచకప్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ఆ మ్యాచ్‌లో చివర్లో బ్యాటింగ్‌కు వచ్చిన రోహిత్ కేవలం 16 బంతుల్లోనే 30 పరుగులు చేశాడని, దానివల్ల జట్టు స్కోరు 157 పరుగులకు చేరిందని యువరాజ్ చెప్పాడు. ‘రోహిత్ చేసిన 30 పరుగులు జట్టుకు ఎంతో ఉపయోగపడ్డాయి. లేకుంటే టీం ఇండియా గెలుపే ప్రశ్నార్థకమయ్యేది. కానీ ఏ ఒక్కరికీ రోహిత్ పోరాటం గుర్తులేదు. అయితే ఆ మ్యాచ్‌లో ఇర్ఫాన్ పఠాన్ 3 వికెట్లు తీశాడు. అతడికే మ్యాచ్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది. అయితే రోహిత్‌కు కూడా కొంత గౌరవం దక్కాల్సిందం’టూ యువరాజ్ పేర్కొన్నాడు.