వచ్చే ఏడాదీ ఆడలేనేమో!
ABN , First Publish Date - 2020-12-15T06:08:05+05:30 IST
స్విట్జర్లాండ్ క్రీడా అవార్డుల ప్రదానోత్సవంలో దిగ్గజం రోజర్ ఫెడరర్ చేసిన ప్రసంగం ప్రపంచ టెన్ని్‌సలో కలకలం రేపింది. వచ్చే ఏడాది పోటీల బరిలోకి దిగేందుకు తన శరీరం సహకరించే అవకాశాలు లేవని వెల్లడించడం...
- ఫెడరర్ నోట రిటైర్మెంట్ మాట
న్యూఢిల్లీ: స్విట్జర్లాండ్ క్రీడా అవార్డుల ప్రదానోత్సవంలో దిగ్గజం రోజర్ ఫెడరర్ చేసిన ప్రసంగం ప్రపంచ టెన్ని్‌సలో కలకలం రేపింది. వచ్చే ఏడాది పోటీల బరిలోకి దిగేందుకు తన శరీరం సహకరించే అవకాశాలు లేవని వెల్లడించడం.. టెన్ని్‌సకు అతడు గుడ్‌బై చెబుతాడన్న ఊహాగానాలకు తెరతీసింది. ‘గత 70 ఏళ్లలో స్విట్జర్లాండ్ గొప్ప క్రీడాకారుడు’ అవార్డును ఫెడరర్ అందుకున్నాడు. ఈ సందర్భంగా మాట్లాడిన రోజర్.. ‘2021లో నేను కోర్టులోకి అడుగుపెడతానని ఆశిస్తున్నా. కానీ అది జరుగుతుందో లేదో చూడాలి’ అని అనడంతో అంతా అవాక్కయ్యారు. అంతే కాదు..తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘నా కెరీర్ ఇక్కడితో ఆగిపోవాల్సి ఉంటే.. ఈ అవార్డుతో ముగించడం కంటే అద్భుతం ఏమి ఉంటుంది’ అని అతడు వ్యాఖ్యానించడం ప్రపంచవ్యాప్తంగా సంచలనమైంది. 39 ఏళ్ల ఫెడెక్స్ చివరిగా నిరుటి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడాడు. అనంతరం ఫిబ్రవరిలో మోకాలి ఆపరేషన్ చేయించుకున్న అతడు.. 2020 సీజన్‌లో బరిలోకి దిగడం లేదని జూన్‌లో ప్రకటించాడు.