ఆసీస్ చేతిలో ఘోర పరాజయం తర్వాత కోహ్లీ స్పందన ఇదీ!

ABN , First Publish Date - 2020-12-19T21:28:48+05:30 IST

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో ఘోర పరాజయంపై టీమిండియా సారథి విరాట్ కోహ్లీ స్పందించాడు.

ఆసీస్ చేతిలో ఘోర పరాజయం తర్వాత కోహ్లీ స్పందన ఇదీ!

అడిలైడ్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో ఘోర పరాజయంపై టీమిండియా సారథి విరాట్ కోహ్లీ స్పందించాడు. మూడో రోజు బ్యాట్స్‌మెన్ సామర్థ్యానికి తగ్గట్టుగా ఆడలేదని, నిజానికీ ఓటమి తనను తీవ్రంగా బాధిస్తోందని అన్నాడు. ఆ బాధను మాటల్లో వర్ణించడం సాధ్యం కాదన్నాడు. ఆసీస్ బౌలర్లపై కోహ్లీ ప్రశంసలు కురిపించాడు. తొలి ఇన్నింగ్స్‌లానే లైన్ అండ్ లెంగ్త్ తప్పకుండా బౌలింగ్ వేశారని, ఆశావహ ధోరణి కూడా వారి విజయానికి బాటలు వేసిందని అన్నాడు. తాము బ్యాటింగ్ ప్రారంభించేటప్పుడు 60 పరుగుల ఆధిక్యంలో ఉన్నామని, ఆ తర్వాత ఒక్కసారిగా బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలిందన్నాడు.


తొలి రెండు రోజులు బాగానే ఆడామని, కానీ మూడో రోజు ఒక్క గంటలో ఓటమి పాలయ్యామని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఓటమి నిజంగా బాధించిందన్నాడు. బహుశా బ్యాటింగులో తాము తగినంత శ్రద్ధ పెట్టలేదని అనిపిస్తోందన్నాడు. దీని నుంచి తాము నేర్చుకోవాల్సి ఎంతో ఉందన్నాడు. ఆసీస్ బౌలర్లు తొలి ఇన్నింగ్స్‌లానే బంతులు విసిరారని, అయితే పరుగులు పిండుకోవాలన్న తపనలో వికెట్లు పారేసుకున్నామన్నాడు.


ఆసీస్ బౌలర్లు మంచి బంతులు వేసినప్పటికీ మరీ ఇంత దారుణంగా దెబ్బతీస్తారని ఊహించలేకపోయామన్నాడు. బ్యాటింగులో ఆసక్తి లేకపోవడం, ఆసీస్ బౌలర్లు చక్కని ఏరియాల్లో బంతులు విసరడమే తమ ఓటమికి కారణమన్నాడు. ఈ నెల 26న ప్రారంభం కానున్న బాక్సింగ్ డే టెస్టులో పుంజుకుంటామని కోహ్లీ ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా, భార్య అనుష్క తొలి బిడ్డకు జన్మనివ్వనున్న నేపథ్యంలో కోహ్లీ భారత్ రానున్నాడు. దీంతో మిగతా టెస్టులకు కోహ్లీ అందుబాటులో ఉండడు. 

Read more