రంజీట్రోఫీ ఫైనల్: ఆఖరి రోజు ప్రేక్షకులకు నో ఎంట్రీ

ABN , First Publish Date - 2020-03-13T03:14:04+05:30 IST

రంజీట్రోఫీలో భాగంగా సౌరాష్ట్ర-బెంగాల్ జట్ల మధ్య ఇక్కడి సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో

రంజీట్రోఫీ ఫైనల్: ఆఖరి రోజు ప్రేక్షకులకు నో ఎంట్రీ

రాజ్‌కోట్: రంజీట్రోఫీలో భాగంగా సౌరాష్ట్ర-బెంగాల్ జట్ల మధ్య ఇక్కడి సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఫైనల్ జరుగుతోంది. నాలుగో రోజైన గురువారం ఆటముగిసే సమయానికి బెంగాల్ జట్టు ఆరు వికెట్ల నష్టానికి 354 పరుగులు చేసింది. శుక్రవారం చివరి రోజు. కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో కేంద్రం సూచనల మేరకు ఆఖరి రోజు ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతించే అవకాశం లేదని తెలుస్తోంది. క్లోజ్‌డ్ డోర్స్ మధ్య ఆఖరి రోజు మ్యాచ్ జరగనున్నట్టు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. అలాగే, దక్షిణాఫ్రికాతో జరగనున్న చివరి రెండు వన్డేలు కూడా ఖాళీ స్టాండ్స్ మధ్య జరగనున్నాయి. 


కరోనా వైరస్ దేశంలో మరింత వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకున్న కేంద్రం ఏప్రిల్ 15వ తేదీ వరకు అన్ని వీసాలను రద్దు చేసింది. ప్రభుత్వ నిర్ణయం ఐపీఎల్‌పైనా ప్రభావం చూపనుంది. ఏప్రిల్ 15 వరకు వీసాలను రద్దు చేయడంతో ఐపీఎల్‌లో పాల్గొనాల్సిన విదేశీ ఆటగాళ్లు భారత్‌కు వచ్చే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ల నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. మ్యాచ్‌లను వాయిదా వేసే అవకాశం లేకుంటే ప్రేక్షకులు లేకుండా నిర్వహించుకోవచ్చని తాజాగా కేంద్రం స్పష్టం చేసింది. కేంద్రం ఆదేశాలతో రంజీ ఫైనల్ చివరి రోజైన శుక్రవారం నాడు ప్రేక్షకులకు అనుమతి నిరాకరించనున్నారు. 

Updated Date - 2020-03-13T03:14:04+05:30 IST