అదరగొట్టిన ‘దేశవాళీ’

ABN , First Publish Date - 2020-10-12T08:57:50+05:30 IST

రాహుల్‌ తెవాటియా (28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 45 నాటౌట్‌) మ్యాచ్‌ విన్నింగ్‌ ఇన్నింగ్స్‌తో రాజస్థాన్‌ రాయల్స్‌ మళ్లీ ..

అదరగొట్టిన   ‘దేశవాళీ’

 తిప్పేసిన తెవాటియా, పరాగ్‌

సన్‌రైజర్స్‌పై రాజస్థాన్‌ గెలుపు


  దుబాయ్‌: రాహుల్‌ తెవాటియా (28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 45 నాటౌట్‌) మ్యాచ్‌ విన్నింగ్‌ ఇన్నింగ్స్‌తో రాజస్థాన్‌ రాయల్స్‌ మళ్లీ గెలుపుబాట పట్టింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ తెవాటియాకు రియాన్‌ పరాగ్‌ (42 నాటౌట్‌) తోడవడంతో.. ఐపీఎల్‌లో ఆదివారం సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో రాజస్థాన్‌ 5 వికెట్ల తేడాతో నెగ్గింది. విదేశీ ఆటగాళ్లు బ్యాట్లెత్తేసినా దేశవాళీ ప్లేయర్లు మెరవడంతో.. నాలుగు వరుస పరాజయాలకు రాయల్స్‌ బ్రేకులు వేసింది. తొలుత సన్‌రైజర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 158/4 స్కోరు చేసింది. మనీష్‌ పాండే ( 54) అర్ధ శతకం సాధించాడు. లక్ష్యాన్ని రాజస్థాన్‌ 19.5 ఓవర్లలో 163/5తో ఛేదించింది. రషీద్‌ (2/25), ఖలీల్‌ (2/37) చెరో రెండు వికెట్లు పడగొట్టారు. 


టాపార్డర్‌ విఫలం..:

ఛేదనలో రాజస్థాన్‌ 12 ఓవర్లలో 78/5తో పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో పరాగ్‌కు జత కలసిన తెవాటియా మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేశాడు. ఆరో వికెట్‌కు వీరిద్దరూ అజేయంగా 85 పరుగులు జోడించడంతో రాజస్థాన్‌ అనూహ్యంగా నెగ్గింది. రషీద్‌ వేసిన 18వ ఓవర్‌లో తెవాటియా వరుసగా మూడు ఫోర్లు.. ఆ తర్వాతి ఓవర్‌లో 4,6తో చెలరేగడంతో మ్యాచ్‌ రాయల్స్‌ వైపు మొగ్గింది. సిక్స్‌తో పరాగ్‌ ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చాడు. ఓపెనర్లు స్టోక్స్‌ (5), బట్లర్‌ (16)ను ఖలీల్‌ అవుట్‌ చేసి ఆరంభంలోనే దెబ్బకొట్టాడు. కెప్టెన్‌ స్మిత్‌ (5) రనౌట్‌ అయ్యాడు. ఊతప్ప (18), సంజూ (26)ను రషీద్‌ వెనక్కిపంపాడు. 


ఆదుకున్న మనీష్‌..:

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న సన్‌రైజర్స్‌.. స్వల్ప స్కోరుకే ఓపెనర్‌ బెయిర్‌స్టో (16)ను కోల్పోయింది. అయితే, మరో ఓపెనర్‌ వార్నర్‌ (48), మనీష్‌ పాండే స్కోరు బోర్డును నడిపించారు. వార్నర్‌ను బౌల్డ్‌ చేసిన ఆర్చర్‌ (1/25).. రెండో వికెట్‌కు 73 పరుగుల భాగస్వామ్యాన్ని విడదీశాడు. హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న పాండే.. ఉనాద్కట్‌ బౌలింగ్‌లో షాట్‌ ఆడే క్రమంలో తెవాటియాకు చిక్కాడు. విలియమ్సన్‌ (22 నాటౌట్‌), ప్రియమ్‌ గార్గ్‌ (15).. నాలుగో వికెట్‌కు 36 రన్స్‌ జోడించడంతో స్కోరు 150 పరుగుల మార్క్‌ దాటింది.


స్కోరు బోర్డు

  సన్‌రైజర్స్‌: వార్నర్‌ (బి) ఆర్చర్‌ 48, బెయిర్‌స్టో (సి) సంజూ (బి) త్యాగి 16, మనీష్‌ పాండే (సి) తెవాటియా (బి) ఉనాద్కట్‌ 54, విలియమ్సన్‌ (నాటౌట్‌) 22, ప్రియమ్‌ గార్గ్‌ (రనౌట్‌) 15; ఎక్స్‌ట్రాలు: 3; మొత్తం: 20 ఓవర్లలో 158/4; వికెట్ల పతనం: 1-23, 2-96, 3-122, 4-158; బౌలింగ్‌: ఆర్చర్‌ 4-0-25-1, గోపాల్‌ 4-0-31-0, త్యాగి 3-0-29-1, ఉనాద్కట్‌ 4-0-31-1, తెవాటియా 4-0-35-0, స్టోక్స్‌ 1-0-7-0.


రాజస్థాన్‌: స్టోక్స్‌ (బి) ఖలీల్‌ 5, బట్లర్‌ (సి) బెయిర్‌స్టో (బి) ఖలీల్‌ 16, స్మిత్‌ (రనౌట్‌) 5, సంజూ శాంసన్‌ (సి) బెయిర్‌స్టో (బి) రషీద్‌ 26, రాబిన్‌ ఊతప్ప (ఎల్బీ) రషీద్‌ 18, రియాన్‌ పరాగ్‌ (నాటౌట్‌) 42, రాహుల్‌ తెవాటియా (నాటౌట్‌) 45; ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: 19.5 ఓవర్లలో 163/5; వికెట్ల పతనం: 1-7, 2-25, 3-26, 4-63, 5-78; బౌలింగ్‌: సందీప్‌ 4-0-32-0, ఖలీల్‌ 3.5-0-37-2, నటరాజన్‌ 4-1-32-0, అభిషేక్‌ 1-0-11-0, రషీద్‌ 4-0-25-2, విజయ్‌ శంకర్‌ 3-0-22-0.

Updated Date - 2020-10-12T08:57:50+05:30 IST