భువీ స్థానంలో పృథ్వీరాజ్
ABN , First Publish Date - 2020-10-07T09:16:00+05:30 IST
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఆంధ్రప్రదేశ్ క్రికెటర్, 22 ఏళ్ల పృథ్వీరాజ్ యర్రా చోటు దక్కించుకున్నాడు.

జట్టులో తెలుగు కుర్రాడికి చోటు
దుబాయ్: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఆంధ్రప్రదేశ్ క్రికెటర్, 22 ఏళ్ల పృథ్వీరాజ్ యర్రా చోటు దక్కించుకున్నాడు. ఈనెల 2న చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ పేసర్ భువనేశ్వర్ తొడ కండరాలు పట్టేయడంతో టోర్నీకి దూరమయ్యాడు. దీంతో భువీ స్థానాన్ని ఎడమ చేతి పేసర్ పృథ్వీరాజ్ భర్తీ చేయనున్నాడు. ఈమేరకు ట్విటర్‌లో అధికారికంగా ప్రకటించారు. ‘గాయంతో పేసర్ భువనేశ్వర్ ఈ సీజన్‌కు దూరమయ్యాడు. త్వరలోనే అతడు కోలుకోవాలని ఆశిస్తున్నాం. మిగిలిన్ సీజన్ కోసం అతడి స్థానాన్ని పృథ్వీరాజ్ యర్రాతో భర్తీ చేస్తున్నాం’ అని సన్‌రైజర్స్ హైదరాబాద్ ట్విటర్ పేజీలో పేర్కొంది.
నెట్‌బౌలర్‌గా పృథ్వీరాజ్ ప్రస్తుతం యూఏఈ లోనే ఉన్నాడు. విశాఖపట్నంకు చెందిన పృథ్వీరాజ్ ఏపీ తరఫున 11 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 39 వికెట్లు తీసుకున్నాడు. పృథ్వీ గతేడాది ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున రెండు మ్యాచ్‌లు ఆడి ఒక వికెట్ తీశాడు. అయితే నిరుడు డిసెంబరులో జరిగిన ఆటగాళ్ల వేలానికి ముందే అతడిని కోల్‌కతా వదులుకొంది. కాగా, ఈ పిలుపును తాను ఊహించలేదని పృథ్వీరాజ్ సంతోషం వ్యక్తం చేశాడు. తనకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానన్నాడు.