క్రికెట్‌కు పార్థివ్ గుడ్‌బై
ABN , First Publish Date - 2020-12-10T09:15:13+05:30 IST
పిన్న వయసులోనే టెస్టు క్రికెట్ ఆడిన భారత వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకొంటున్నట్టు 35 ఏళ్ల పార్థివ్ బుధవారం ప్రకటించాడు...

- 18 ఏళ్ల కెరీర్‌కు వీడ్కోలు
- టెస్టులు ఆడిన పిన్న వయసు
- వికెట్ కీపర్‌గా రికార్డు
న్యూఢిల్లీ: పిన్న వయసులోనే టెస్టు క్రికెట్ ఆడిన భారత వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకొంటున్నట్టు 35 ఏళ్ల పార్థివ్ బుధవారం ప్రకటించాడు. గుజరాత్‌కు చెందిన పటేల్.. 17 ఏళ్ల 153 రోజుల వయసులో గంగూలీ సారథ్యంలో టెస్టుల్లో (2002లో)అరంగేట్రం చేశాడు. తద్వారా చిన్న వయసులో సుదీర్ఘ ఫార్మాట్ ఆడిన కీపర్‌గా రికార్డు సృష్టించాడు. ఎడమ చేతివాటం బ్యాట్స్‌మన్ అయిన పార్థివ్.. 18 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి 1706 పరుగులు చేశాడు. 25 టెస్టుల్లో 6 అర్ధ శతకాలతో 934 రన్స్, 38 వన్డేల్లో 4 హాఫ్ సెంచరీలతో 736 రన్స్, 2 టీ20ల్లో 36 పరుగులు సాధించాడు. టెస్టుల్లో కీపర్‌గా 72 మందిని అవుట్ చేశాడు. అందులో 62 క్యాచ్‌లు, 10 స్టంపింగ్‌లు ఉన్నాయి. ‘పద్దెనిమిదేళ్ల కెరీర్‌కు తెరదించుతున్నా. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకొంటున్నా. టీనేజరైన నాపై బీసీసీఐ ఎంతో విశ్వాసం ఉంచింది. కెరీర్ ఆరంభంలో నాకు మార్గదర్శనం చేస్తూ అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు’ అని పార్థివ్ ట్వీట్ చేశాడు. గంగూలీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాడు.
రంజీలు కూడా ఆడకుండానే..
అప్పట్లో టీమిండియాలోకి పార్థివ్ ఎంట్రీనే పెద్ద సంచలనం. 2002 ఇంగ్లండ్ టూర్‌లో నాటింగ్‌హామ్ టెస్టులో అతడు తొలిసారి బరిలోకి దిగాడు. ఒక్క రంజీ మ్యాచ్ కూడా ఆడకుండానే బీసీసీఐ అతణ్ణి టెస్టులకు ఎంపిక చేయడం అప్పట్లో ఎంతో చర్చనీయాంశమైంది. వికెట్ కీపర్ అజయ్ రాత్రా గాయపడడంతో.. భారత జట్టుకు సుదీర్ఘకాలం సేవలందించే విధంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో గంగూలీ అండ్ కో.. పాలబుగ్గల పసివాడైన పటేల్‌పై దృష్టిపెట్టింది. 2004లో ఆస్ట్రేలియా, పాకిస్థాన్ పర్యటనల్లో కీపర్‌గా పేలవ ప్రదర్శన చేయడంతో అతడిపై వేటు పడింది. ఆ తర్వాత రంజీల్లోకి అడుగుపెట్టాడు. ఈలోపు ధోనీ ఎంట్రీ ఇవ్వడంతో పార్థివ్‌కు దారులు మూసుకుపోయాయి. రెండో కీపర్‌గా, స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్‌గా నెట్టుకు రావాల్సి వచ్చింది. రీఎంట్రీలో వైట్‌బాల్ క్రికెట్‌లో ఓపెనర్‌గా అప్పుడప్పుడూ మెరుపులు మెరిపించాడు. టీమిండియాకు ఆడే అవకాశాలు ఎక్కువగా రాకపోయినా.. ఎప్పుడూ క్రీడాస్ఫూర్తిని వీడలేదు. కెరీర్‌లో తాను వెనుకబడడానికి ధోనీ కారణం కాదని పటేల్ తరచూ చెప్పేవాడు. కాగా, దేశవాళీల్లో పార్థివ్ 194 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 43 సగటుతో 11,240 రన్స్ సాధించాడు. అందులో 27 సెంచరీలున్నాయి. 2016-17 సీజన్‌లో పార్థివ్ కెప్టెన్సీలో గుజరాత్ తొలిసారి రంజీ టైటిల్‌ను సొంతం చేసుకొంది. ఐపీఎల్‌లో ముంబై, చెన్నై, బెంగళూరు తరఫున ఆడాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో బెంగళూరు తరఫున ఒక్క మ్యాచ్ కూడా ఆడే చాన్స్ రాకపోవడంతో.. కెరీర్‌కు గుడ్‌బై చెప్పాలనే నిర్ణయం తీసుకొన్నట్టు భావిస్తున్నారు.
దాదా, కుంబ్లే గొప్ప నాయకులు: పార్థివ్
గంగూలీ, అనిల్ కుంబ్లే నా దృష్టిలో గొప్ప నాయకులు. వారి ప్రభావం క్రికెట్ వరకే కాకుండా.. నా జీవితంపై ఎల్లప్పుడూ ఉంటుంది. దాదా ఇచ్చిన తొలి టెస్టు క్యాప్ ఇప్పటికీ ఎంతో భద్రంగా ఉంచుకున్నా. దానిపై నా పేరు స్పెల్లింగ్‌ను తప్పుగా ముద్రించారు. ఇక, ఏడాదిగా రిటైర్మెంట్ ఆలోచన మదిలో మెదులుతూనే ఉంది. ఇప్పుడిక ప్రశాంతంగా నిద్రపోతా. నా దృష్టిలో టెస్టు కీపర్ అనేవాడు సాహా తరహాలో కీపర్‌గానూ, బ్యాట్స్‌మన్‌గానూ రాణించాలి.
అతడిది కష్టించే తత్వం: గంగూలీ
భారత క్రికెట్‌కు అతడో గొప్ప రాయబారి. జట్టు కోసం ఎంతో శ్రమించేవాడు. నా సారథ్యంలో పార్థివ్ అరంగేట్రం చేయడం ఎంతో ఆనందాన్నిచ్చింది. భవిష్యత్తులో అతడికి అన్నీ శుభాలు జరగాలి.