అది ‘ఆలూ’ గురించి కాదు.. అజారుద్దీన్‌ గురించి: వకార్ యోనిస్

ABN , First Publish Date - 2020-07-18T23:19:09+05:30 IST

1997 షార్జీ కప్‌లో భాగంగా ఓ భారత అభిమానిపై అప్పటి పాక్ జట్టు సభ్యుడు ఇంజమామ్ దాడి చేసిన విషయం ఇప్పటికీ...

అది ‘ఆలూ’ గురించి కాదు.. అజారుద్దీన్‌ గురించి: వకార్ యోనిస్

ఇస్లామాబాద్: 1997 షార్జా కప్‌లో భాగంగా ఓ భారత అభిమానిపై అప్పటి పాక్ జట్టు సభ్యుడు ఇంజమామ్ దాడి చేసిన విషయం ఇప్పటికీ చాలా మందికి గుర్తుండే ఉంటుంది. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న ఇంజమామ్‌ను భారత్‌కు చెందిన ఓ ప్రేక్షకుడు మాటిమాటికీ ఆలూ(బంగాళదుంప) అంటూ హేళన చేశాడనీ, దాంతో ఇంజమామ్ అతడిపై దాడికి పాల్పడ్డాడని ఆ తరువాత ఎన్నో వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలన్నీ తప్పని పాక్ మాజీ పేసర్ వకార్ యూనిస్ స్పష్టం చేశాడు. ఇంజమామ్ దాడి చేయడానికి కారణం అతడిని ఆలూ అని పిలవడం కాదని, అందుకు వేరే కారణం ఉందని తెలిపాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆ సంఘటనకు సంబంధించిన విషయాలను వకార్ బయటపెట్టాడు. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న ఇంజామామ్‌ను ఆలూ అంటూ ఎవరో హేళన చేసిన మాట వాస్తవమేనని, అయితే ఇంజమామ్ లోనికి దూకి మరీ అతడిని చితకబాదడానికి కారణం వేరే ఉందని వకార్ వివరించాడు.


‘షార్జా కప్ రెండో మ్యాచ్‌లో బౌండరీలైన్ వద్ద ఇంజమామ్‌ ఫీల్డింగ్ చేస్తుండగా అతడిని వెనుకనుంచి ఎవరో ఆలూ అంటూ హేళన చేసిన మాట వాస్తవం. అయితే ఇంజమామ్ సంయమనం కోల్పోలేదు. ఆ మాటలను అంతగా పట్టించుకలేదు. అయితే భారత కెప్టెన్ అజారుద్దీన్ భార్యను గురించి కూడా ప్రేక్షకుల్లో ఒకరు అనుచిత వ్యాఖ్యలు చేయడం మొదలెట్టారు. దీంతో ఇంజమామ్‌కు కోపం కట్టలు తెంచుకుంది. వెంటనే లోనికి దూకి అతడిని చితకబాదాడు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది వచ్చి ఇంజమామ్‌ను వెనక్కి లాక్కొచ్చారు. అయితే ఇంజమామ్‌కు అప్పటికీ కోపం తగ్గకపోవడంతో పక్కనే ఉన్న క్రికెట్ బ్యాట్ తీసుకుని ఆ ప్రేక్షకుడిని కొట్టబోయాడు. అదృష్టవశాత్తూ అతడు కనురెప్పపాటులో తప్పించుకున్నాడు. లేకుంటే  ఏమై ఉండేదో.


తనను తిట్టినా ఇంజీ పట్టించుకేలేదు. కానీ తన స్నేహితుడు అజారుద్దీన్‌ భార్యను దూషించేసరికి తట్టుకోలేకపోయాడం’టూ వకార్ వివరించాడు. ఇదిలా ఉంటే అజారుద్దీన్‌కు ఇంజమామ్‌కు మంచి దోస్తీ ఉందని, గ్రౌండ్ లోపల మ్యాచ్‌లో నువ్వా నేనా అని పోరాడినా బయట వారి స్నేహం చాలా గొప్పగా ఉండేదని తెలిపాడు. అందువల్లే ఆ తరువాత అన్ని వార్తా పత్రికల్లో, చానెళ్లలో తప్పుడు వార్తలొచ్చినా ఇంజమామ్ స్పందించలేదని, తనను తిట్టినందుకే ఇంజమామ్ దాడి చేశాడని కథనాలొచ్చినా అంతగా పట్టించుకోలేదని వకార్ యోనిస్ తెలిపాడు.

Updated Date - 2020-07-18T23:19:09+05:30 IST