దేశం కాదు.. ప్రేమే ముఖ్యం.. సానియాతో వివాహంపై మళ్లీ స్పందించిన షోయబ్

ABN , First Publish Date - 2020-06-22T19:31:25+05:30 IST

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్తాన్ క్రికెట్ ఆల్‌రౌండర్ షోయబ్ మాలిక్‌ 2008లో వివాహం చేసుకున్న...

దేశం కాదు.. ప్రేమే ముఖ్యం.. సానియాతో వివాహంపై మళ్లీ స్పందించిన షోయబ్

ఇస్లామాబాద్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్తాన్ క్రికెట్ ఆల్‌రౌండర్ షోయబ్ మాలిక్‌ 2008లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వివాహం తరువాత ఇద్దరూ యూఏఈలో కాపురం పెట్టారు. అప్పటి నుంచి వీరిద్దరిపై అనేక వార్తలు ఇరు దేశాల్లో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. దీనిపై మొదట్లో సానియా, మాలిక్‌లు స్పందించినా తరువాత పట్టించుకోవడం మానేశారు. ఇదిలా ఉంటే ఇటీవల సానియా హైదరాబాద్‌లోని పుట్టింటికి వచ్చారు. షోయబ్ మాలిక్ కూడా పీఎస్ఎల్(పాకిస్తాన్ ప్రామియర్ లీగ్)లో ఆడేందుకు పాకిస్తాన్ వెళ్లాడు. అయితే అనుకోకుండా కరోనా రావడం, భారత్‌లో లాక్‌డౌన్ విధించడంతో సానియా ఇక్కడే ఇరుక్కుపోయారు. దీంతో దాదాపు 3 నెలల నుంచి భార్య, కొడుకును చూడలేకపోయాడు. లాక్‌డౌన్ నిబంధనలు సడలించడంతో మాలిక్ హైదరాబాద్ చేరుకోనున్నాడు. ఈ నేపథ్యంలో మాలిక్ మాట్లాడుతూ, తాను సానియాను వివాహం చేసుకున్నప్పటి నుంచి అనేక విమర్శలు ఎదురవుతున్నాయని, అయితే తాను ఓ ఆటగాడినని, రాజకీయ నాయకుడిని కాదని, ఇరు దేశాల మధ్య ఉన్న పరిస్థితులతో తన వివాహానికి సంబంధం లేదని స్పష్టం చేశారు.


‘మేమిద్దరం ఒకరినొకరు ఇష్టపడ్డాం. వివాహం చేసుకున్నాం. ఆనందంగా ఉంటున్నాం. భారత్, పాకిస్తాన్‌ల మధ్య రాజకీయంగా ఎలాంటి పరిస్థితులున్నా, దాంతో మా పెళ్లికి సంబంధం లేదు’ అని మాలిక్ చెప్పుకొచ్చాడు. తాను ప్రేమించిన వ్యక్తి భారత్‌కు చెందిన వ్యక్తి అయినప్పటికీ, ఆ దేశంతో తన దేశానికి రాజకీయంగా పలు సమస్యలున్నప్పటికీ, దానితో తమకు సంబంధం లేదని, తమ ప్రేమ గురించి తప్ప వేరేవాటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని మాలిక్ స్పష్టం చేశాడు.

Updated Date - 2020-06-22T19:31:25+05:30 IST