విశ్వ క్రీడల వాయిదా తప్పదా?

ABN , First Publish Date - 2020-03-04T09:51:47+05:30 IST

ప్రపంచ దేశాలన్నింటినీ వణికిస్తున్న కరోనా వైరస్‌ ప్రభావం ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌ గేమ్స్‌పైనా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. జపాన్‌ ఒలింపిక్‌ మంత్రి సీకో హషిమోటో వ్యాఖ్యలు వింటే షెడ్యూల్‌ ప్రకారం ఈ మెగా ఈవెంట్‌ జరిగేది సందేహంగానే మారింది. ఎందుకంటే.. విశ్వక్రీడలను ఈ ఏడాదిలో ఎప్పుడైనా జరిపే వీలుందని

విశ్వ క్రీడల వాయిదా తప్పదా?

టోక్యో: ప్రపంచ దేశాలన్నింటినీ వణికిస్తున్న కరోనా వైరస్‌ ప్రభావం ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌ గేమ్స్‌పైనా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. జపాన్‌ ఒలింపిక్‌ మంత్రి సీకో హషిమోటో వ్యాఖ్యలు వింటే షెడ్యూల్‌ ప్రకారం ఈ మెగా ఈవెంట్‌ జరిగేది సందేహంగానే మారింది. ఎందుకంటే.. విశ్వక్రీడలను ఈ ఏడాదిలో ఎప్పుడైనా జరిపే వీలుందని ఆమె నర్మగర్భంగా వ్యాఖ్యానించడమే. వాస్తవానికి జూలై 24 నుంచి ఆగస్టు 9 వరకు టోక్యోలో ఈ మెగా ఈవెంట్‌ జరగాల్సి ఉంది. కానీ చైనాలో మొదలుకొని విశ్వమంతా వ్యాపిస్తున్న కోవిడ్‌-19 వైరస్‌కు జపాన్‌ కూడా వణుకుతోంది. ఇప్పటికే అక్కడ 12 మంది మరణించగా స్కూళ్ల మూసివేతతోపాటు, క్రీడా పోటీలు, ఒలింపిక్‌ సంబంధిత ఈవెంట్లన్నింటినీ రద్దు చేశారు. దీంతో ఒలింపిక్స్‌ నిర్వహణపైనా నీలినీడలు కమ్ముకున్నాయి. ‘తాజా పరిస్థితుల్లో గేమ్స్‌ షెడ్యూల్‌ ప్రకారం జరగకపోవచ్చు. కానీ ఈ ఏడాదిలో ఎప్పుడైనా జరిపే వెసులుబాటు మాకుంది. ఒకవేళ ఈ ఏడాది వీలుకాకపోతేనే అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ ఈ గేమ్స్‌ను రద్దు చేసే వీలుంటుంది’ అని సీకో హషిమోటో పార్లమెంట్‌లో వివరించారు. మరోవైపు కరోనా ఉధృతి కారణంగా ఈ గేమ్స్‌ రద్దు అవుతాయని లేదా ఇతర నగరాలకు తరలుతాయని పుకార్లు వినిపిస్తున్నాయి.


ఆర్థికంగా భారీ నష్టమే..

ఒలింపిక్స్‌ నిర్వహణ అంటే మామూలు విషయం కాదు. నిర్వాహక దేశం బిలియన్ల డాలర్లు కుమ్మరించాల్సి ఉంటుంది. ఈ గేమ్స్‌ కోసం జపాన్‌ కూడా 12.35 బిలియన్‌ డాలర్లను తమ బడ్జెట్‌లో కేటాయించింది. అటు ఐఓసీ కూడా తమవంతుగా 800 మిలియన్‌ డాలర్లను అందించింది. ఇక రూ.10 వేల కోట్లను కొత్త స్టేడియాల నిర్మాణానికే ఖర్చు చేసింది. ఒకవేళ గేమ్స్‌ రద్దు అయితే ఈ ఖర్చులన్నీ తడిసి మోపెడై జపాన్‌ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసే ప్రమాదం కూడా ఉంటుంది. అటు ఇన్సూరెన్స్‌ కంపెనీలు కూడా తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుంది.

Updated Date - 2020-03-04T09:51:47+05:30 IST