ఖేల్‌రత్న దరఖాస్తుకు అర్హుడిని కాదు

ABN , First Publish Date - 2020-07-19T09:05:35+05:30 IST

ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక క్రీడా పురస్కారం రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న నామినేషన్‌ నుంచి తన పేరును తప్పించడంపై వస్తున్న విమర్శలకు వెటరన్‌ ఆఫ్‌ స్పిన్నర్‌...

ఖేల్‌రత్న దరఖాస్తుకు అర్హుడిని కాదు

న్యూఢిల్లీ: ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక క్రీడా పురస్కారం రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న నామినేషన్‌ నుంచి తన పేరును తప్పించడంపై వస్తున్న విమర్శలకు వెటరన్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ వివరణ ఇచ్చాడు. ఇందులో పంజాబ్‌ ప్రభుత్వం తప్పు లేదనీ.. తానే స్వయంగా అవార్డు ప్రతిపాదన నుంచి తన పేరును తొలగించాలని కోరానని భజ్జీ చెప్పుకొచ్చాడు. ‘ఖేల్‌రత్న నామినేషన్స్‌ నుంచి నీ పేరును పంజాబ్‌ ప్రభుత్వం ఎందుకు తప్పించిందంటూ చాలామంది నాకు ఫోన్‌ చేస్తున్నారు. నిబంధనల ప్రకారం ఈ అవార్డుకు ఎవరైనా దరఖాస్తు చేసుకోవాలంటే గత మూడేళ్ల అంతర్జాతీయ ప్రదర్శన ప్రామాణికం. ఈ లెక్కన చూసుకుంటే నేను అర్హుడిని కాదు. అందుకే నా పేరును పంపొద్దని రాష్ట్ర క్రీడాశాఖకు చెప్పా. దీంతో వారు నా పేరును నామినేషన్స్‌ నుంచి ఉపసంహరించారు. ఇందుకు ప్రభుత్వాన్ని నిందించాల్సిన అవసరం లేదు’ అని 40 ఏండ్ల హర్భజన్‌ శనివారం ట్వీట్‌ చేశాడు. చివరిసారిగా 2016లో ఆసియా కప్‌  ఆడిన హర్భజన్‌.. ఆ తర్వాత జాతీయ జట్టుకు ఎంపిక కాలేదు. 2015లో చివరి టెస్టు ఆడిన హర్భజన్‌ ఇప్పటికే అర్జునతో పాటు దేశ అత్యున్నత నాలుగో పౌర పురస్కారం పద్మశ్రీ అందుకున్నాడు. 


Updated Date - 2020-07-19T09:05:35+05:30 IST