ప్రభుత్వ ఆసరా కావాలి
ABN , First Publish Date - 2020-07-19T09:04:27+05:30 IST
సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి అంతర్జాతీయ బాక్సర్ స్థాయికి ఎదగడం సామాన్యమైన విషయం కాదు. దాని వెనకాల కఠోర శ్రమ దాగి ఉంటుంది....

రింగ్‌లోకి అడుగు పెట్టాక ప్రత్యర్థిని మెరుపు వేగంతో చిత్తు చేయడం నిఖత్ జరీన్‌కు వెన్నతో పెట్టిన విద్య. జూనియర్ స్థాయి నుంచే పతకాలు కొల్లగొట్టడం అలవాటుగా చేసుకున్న ఈ తెలుగమ్మాయి టోక్యో ఒలింపిక్స్ బెర్త్ కోసం దిగ్గజం మేరీ కోమ్నే సవాల్ చేసింది. అంతర్జాతీయ స్థాయిలో పతకాలు కొల్లగొట్టి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఈ యువ బాక్సర్.. తనకు రావాల్సిన ప్రభుత్వ ప్రోత్సాహకాల కోసం ఇప్పుడు ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో నిఖత్ సమస్యలేంటో ఆమె మాటల్లోనే..
సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి అంతర్జాతీయ బాక్సర్ స్థాయికి ఎదగడం సామాన్యమైన విషయం కాదు. దాని వెనకాల కఠోర శ్రమ దాగి ఉంటుంది. బాక్సింగ్‌లో అరంగేట్రం చేసినప్పటి నుంచి ఇప్పటివరకు కెరీర్లో ఎదురైన ఒడిదుడుకులన్నింటినీ తట్టుకొని నిలబడ్డా. ఈ క్రమంలో నా తల్లిదండ్రులు అండగా నిలిచారు. ఇకముందు కూడా నా లక్ష్య సాధన కోసం మరింత పట్టుదలగా పోరాడతా. అయితే, అందుకు ప్రభుత్వ సహకారమందిస్తే నా మీదున్న కుటుంబ బాధ్యతల ఒత్తిడి తగ్గుతుంది. సడలని ఏకాగ్రతతో మరింత కష్టపడి రాణించడానికి అవకాశం ఉంటుంది.
ఏడాది నుంచి అడుగుతున్నా...
గతంలో జేఎ్‌సడబ్ల్యూ స్పోర్ట్స్ వెంచర్ నెలకు రూ.15 వేలు ఉపకార వేతనంలా ఇచ్చేది. లాక్‌డౌన్‌తో అది నిలిచిపోయింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) నెలనెలా ఇచ్చే మొత్తం.. డైట్, బాక్సింగ్‌కు కావాల్సిన వస్తువుల కొనుగోలుకే సరిపోతుంది. వయసు మీద పడిన నా తల్లిదండ్రులకు నేనే ఆధారం. కుటుంబ పోషణ కోసం నేను ఏదైనా ప్రైవేట్ ఉద్యోగం చేస్తే.. సాధన పక్కదారి పడుతుంది. అప్పుడు కెరీరే ప్రమాదంలో చిక్కుకునే అవకాశముంది. అలా కాకూడదని కిందటి ఏడాది జనవరిలో సీఎం కేసీఆర్ సార్‌ను కలిసి నా ఇబ్బందిని వివరించా. నా విజ్ఞప్తిని పరిశీలించాలని సీఎంగారు ఉన్నతాధికారులను ఆదేశించారు. కానీ, ఇప్పటివరకు అధికారుల నుంచి నాకు ఎలాంటి పిలుపూ రాలేదు. స్ట్రాంజాలో పసిడి పతకం నెగ్గాక మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్‌ను కలిసి స్పోర్ట్స్ కోటాలో ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరా. సాధన మీదనే దృషి పెట్టు..ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు కానీ, నా ఉద్యోగ విన్నపానికి మోక్షం కలగలేదు. శనివారం కూడా క్రీడామంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను కలిసి నేను ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ఏకరవు పెట్టా. ఆయన త్వరలోనే ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. వారిపై నమ్మకం ఉంది. మంచి జరుగుతుందని ఆశిస్తున్నా.
నగదు ప్రోత్సాహకాల ఊసే లేదు
జాతీయ, ఆసియా, అంతర్జాతీయ పోటీల్లో పతకాలు సాధిస్తే ప్రభుత్వ జీఓల ప్రకారం క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలు అందిస్తారు. థాయ్‌లాండ్ ఓపెన్, ఇండియా ఓపెన్, స్ట్రాంజా, ఆసియా చాంపియన్‌షి్‌ప.. ఇలా గతేడాది అనేక టోర్నీల్లో పతకాలు సాధించా. వీటిలో ఏ ఒక్క పతకానికీ ప్రభుత్వం నుంచి నగదు ప్రోత్సాహకం అందలేదు.
(ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి- హైదరాబాద్)