ముగిసిన కివీస్ బ్యాటింగ్.. భారత్ లక్ష్యం ఎంతంటే..
ABN , First Publish Date - 2020-02-08T17:00:09+05:30 IST
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇక్కడి ఈడెన్ పార్క్ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో న్యూజిలాండ్ బ్యాటింగ్ ముగిసింది. ఈ మ్యాచ్‌లో భారత్

ఆక్లాండ్: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇక్కడి ఈడెన్ పార్క్ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో న్యూజిలాండ్ బ్యాటింగ్ ముగిసింది. ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు ఓపెనర్లు శుభారంభం అందించారు. భారత బౌలర్లను ధీటుగా ఎదురుకుంటూ.. తొలి వికెట్‌కి 93 పరుగులు జోడించారు. అయితే చాహల్ వేసిన 17వ ఓవర్ ఐదో బంతికి హెర్నీ నికోలస్(41) ఎల్‌బీడబ్ల్యూ రూపంలో పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన టామ్ బ్లండెల్‌తో కలిసి.. మరో ఓపెనర్ గుప్టిల్ ఇన్నింగ్స్ నిర్మించడం ప్రారంభించాడు. ఈ క్రమంలో అతను అర్థశతకం కూడా సాధించాడు. అయితే శార్థూల్ ఠాకూర్ బౌలింగ్‌లో బ్లండెల్(22) పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కొంత సమయానికే గుప్టిల్(79) రనౌట్ అయ్యాడు.
ఆ తర్వాత న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్లు ఎవరూ రాణించలేదు. రాస్ టేలర్ భారీ స్కోర్ సాధించే ప్రయత్నం చేసినా.. ఇతర బ్యాట్స్‌మెన్ల నుంచి అతనికి సరైన సహకారం లభించలేదు. టామ్ లాతమ్(7), జేమ్స్ నీశమ్(3), గ్రాండ్‌హోం(5), చాప్‌మాన్(1), సౌతీ(3)లు స్వల్పస్కోర్‌కే పెవిలియన్ చేరారు. అయినప్పటికీ.. టేలర్ పట్టువదలకుండా బ్యాటింగ్ చేశాడు. 74 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులతో 73 పరుగులు చేశాడు. ఈ రోజే అంతర్జాతీయ వన్డేల్లో ఆరంగేట్ర చేసిన కైల్ జేమీసన్ కూడా ఈ మ్యాచ్‌లో రాణించాడు. 24 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సులతో అతను 25 పరుగులు చేశాడు. దీంతో న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి.. 273 పరుగులు చేసింది. భారత బౌలింగ్‌లో చాహల్ 3, శార్థూల్ 2, జడేజా 1 వికెట్ తీశారు.