చేజారినట్టే!

ABN , First Publish Date - 2020-03-02T10:13:45+05:30 IST

న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత బ్యాట్స్‌మెన్‌ వైఫల్యం కొనసాగుతూనే ఉంది. బౌలర్లు అద్వితీయంగా రాణించి ప్రత్యర్థిని ఓ మాదిరి స్కోరుకే

చేజారినట్టే!

షమి, బుమ్రా శ్రమ వృథా 

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ 90/6 

ప్రస్తుత ఆధిక్యం 97 

కివీస్‌ తొలి ఇన్నింగ్స్‌ 235 ఆలౌట్‌ 


 అందివచ్చిన అవకాశాన్ని చేజార్చుకోవడమంటే ఇదే...టెస్టు సిరీస్‌లో తొలిసారి  భారత బౌలర్లు చెలరేగుతూ రెండు సెషన్లలోనే కివీస్‌ పది వికెట్లను నేలకూల్చారు. ప్రత్యర్థి టెయిలెండర్లు కాస్త పోరాడినా కోహ్లీసేనకు స్వల్ప ఆధిక్యం దక్కింది.. ఇక ఈసారైనా బ్యాట్స్‌మెన్‌ స్థాయికి తగ్గట్టు ఆడి న్యూజిలాండ్‌ను ఒత్తిడిలో పడేస్తారేమోనని అంతా ఆశించారు. ప్చ్‌.. ఏం లాభం.. మా ఆటతీరింతే అన్నట్టు క్రీజులోకి వచ్చినంత వేగంగా  పెవిలియన్‌కు చేరారు. ప్రస్తుతం టీమిండియా ఆధిక్యం 97 పరుగులు. చేతిలో ఉన్నవి లోయరార్డర్‌ వికెట్లు మాత్రమే.. ఈ దశలో మన బ్యాట్స్‌మెన్‌ నుంచి ఏమైనా పోరాటం ఆశించవచ్చా? లేక ఈ మ్యాచ్‌ కూడా మూడో రోజే అప్పగిస్తారా? అనేది 

వేచిచూడాల్సిందే..


క్రైస్ట్‌చర్చ్‌: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత బ్యాట్స్‌మెన్‌ వైఫల్యం కొనసాగుతూనే ఉంది. బౌలర్లు అద్వితీయంగా రాణించి ప్రత్యర్థిని ఓ మాదిరి స్కోరుకే కట్టడి చేసినా ఆ ఆనందాన్ని మన స్టార్‌ లైనప్‌ ఆవిరి చేసింది. దీంతో ఈ మ్యాచ్‌పైనా కివీస్‌ పట్టు సాధించింది. రెండో రోజైన ఆదివారం ఆట ముగిసేసరికి భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 36 ఓవర్లలో 6 వికెట్లకు 90 పరుగులు చేసింది. క్రీజులో విహారి (5), పంత్‌ (1) ఉన్నారు. ప్రస్తుతం జట్టు 97 పరుగుల ఆధిక్యంలో ఉండగా చేతిలో నాలుగు వికెట్లున్నాయి. కనీసం మరో వంద పరుగులైనా అదనంగా చేయగలిగితే ఈ మ్యాచ్‌లో భారత్‌ పోరాడేందుకు అవకాశముంటుంది. బౌల్ట్‌కు మూడు వికెట్లు దక్కాయి. అంతకుముందు కివీస్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 73.1 ఓవర్లలో 235 పరుగులకు ఆలౌటైంది. లాథమ్‌ (52) అర్ధసెంచరీ చేయగా చివర్లో జేమిసన్‌ (49), వాగ్నర్‌ (21) తొమ్మిదో వికెట్‌కు 51 పరుగులు జోడించారు. షమికి నాలుగు, బుమ్రాకు మూడు, జడేజాకు రెండు వికెట్లు లభించాయి. 


బౌలర్ల జోరు: ఓవర్‌నైట్‌ స్కోరు 63/0తో పటిష్ఠంగా కనిపించిన కివీస్‌కు భారత పేసర్లు చుక్కలు చూపించారు. ముఖ్యంగా బుమ్రా, షమి కచ్చితమైన లెంగ్త్‌ బంతులతో టపటపా వికెట్లను పడగొట్టారు. మరో ఆరు పరుగులు చేరాయో లేదో ఓపెనర్‌ బ్లండెల్‌ (30)ను ఉమేశ్‌ తొలి వికెట్‌గా అవుట్‌ చేయగా ఫామ్‌లో ఉన్న కెప్టెన్‌ విలియమ్సన్‌ (3)ను బుమ్రా పెవిలియన్‌కు చేర్చడంతో భారత్‌ సంబరాల్లో మునిగింది. మరో ఓపెనర్‌ లాథమ్‌ అర్ధసెంచరీ చేసినా ఓ సూపర్‌ బంతితో షమి అతడిని బౌల్డ్‌ చేశాడు. అటు టేలర్‌ (15), నికోల్స్‌ (14) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోవడంతో తొలి సెషన్‌లోనే కివీస్‌ ఐదు వికెట్లు కోల్పోయింది. 


ఆదుకున్న జేమిసన్‌: బ్రేక్‌ తర్వాత కూడా కివీ్‌సను ఇబ్బందిపెట్టడంలో భారత బౌలర్లు సక్సెస్‌ అయ్యారు. 51వ ఓవర్‌లో బుమ్రా చెలరేగి వాట్లింగ్‌, సౌథీని డకౌట్‌గా పెవిలియన్‌కు చేర్చాడు. ఈ దశలో గ్రాండ్‌హోమ్‌ (26) కొద్దిసేపు  ప్రతిఘటించినా జడేజా ఓవర్‌లో బౌల్డ్‌ అయ్యాడు. ఈ సమయంలో కివీస్‌ 8 వికెట్లకు 177 పరుగులతో ఉండగా ఇక భారత్‌కు భారీ ఆధిక్యం ఖాయమేననిపించింది. కానీ ఈసారి కూడా కివీ్‌సను జేమిసన్‌ ఆదుకున్నాడు. పూర్తి స్థాయి బ్యాట్స్‌మన్‌లా కదం తొక్కుతూ ఏడు బౌండరీలతో చెలరేగాడు. వాగ్నర్‌ (21)తో కలిసి తొమ్మిదో వికెట్‌కు 51 పరుగులు జోడించాడు. అయితే షమి తన వరుస ఓవర్లలో ఈ ఇద్దరినీ అవుట్‌ చేయడంతో కివీస్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది.


మళ్లీ బ్యాట్లెత్తేశారు..: ఏడు పరుగుల స్వల్ప ఆధిక్యంతో భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. కానీ ఆతిథ్య జట్టు టెయిలెండర్లు అద్భుత పోరాటం చేసిన చోట మన టాపార్డర్‌తో పాటు మిడిలార్డర్‌లోనూ ఎవరూ ఓ మోస్తరు ప్రదర్శన కూడా చేయలేకపోయారు. ఒక్క భారీ భాగస్వామ్యం కూడా లేకపోగా రెండవ ఓవర్‌ నుంచే ప్రారంభమైన పతనం రోజు ముగిసేదాకా సాగింది. బౌల్ట్‌ ఇన్‌స్వింగర్లకు మయాంక్‌ (3), పుజార (24) ఇన్నింగ్స్‌ ముగియగా సౌథీ షార్ట్‌ పిచ్‌ బంతికి పృథ్వీ షా (14) నిష్క్రమించాడు. ఇక కోహ్లీ అచ్చం తొలి ఇన్నింగ్స్‌ మాదిరే ఎల్బీ అయి నిరాశపరిచాడు. గ్రాండ్‌హోమ్‌ అతడి వికెట్‌ తీయగా పుజార రివ్యూ కోరాలని సూచించినా నిరాకరించాడు. మరోవైపు..ఓపిగ్గా బ్యాటింగ్‌ చేస్తున్న రహానె (9)ను లెగ్‌సైడ్‌ షార్ట్‌ పిచ్‌ బంతులతో ఊరించిన వాగ్నర్‌ చివరకు ఉచ్చులో పడేశాడు. 31వ ఓవర్‌ మూడో బంతిని ఆఫ్‌సైడ్‌ వైపు జరిగి ఫైన్‌లెగ్‌లో ఆడాలనుకున్న రహానె బౌల్డ్‌ అయ్యాడు. నైట్‌ వాచ్‌మన్‌ ఉమేశ్‌ (1)ను బౌల్ట్‌ అవుట్‌ చేయగా భారత్‌ 6 వికెట్లతో ముగించింది.


రహానె.. టెయిలెండరా? విమర్శించిన భజ్జీ

మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ అజింక్యా రహానెపై టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ తీవ్ర విమర్శలు గుప్పించాడు. షార్ట్‌ బాల్స్‌ ఆడే విషయంలో రహానె తీరును దుయ్యబట్టాడు. అతడి ఆట తీరు చూస్తుంటే టెయిలెండర్‌ క్రీజులో ఉన్నట్టుందని కామెంట్‌ చేశాడు. వాగ్నర్‌ విసిరిన షార్ట్‌ బాల్స్‌కు తగిన సమాధానం ఇవ్వలేక పోయాడని, రహానె ప్రధాన ఆటగాడిగా కనిపించడం లేదన్నాడు. 


కోహ్లీ తీరు వివాదాస్పదం!

 న్యూజిలాండ్‌తో రెండో టెస్టు రెండో రోజు ఆటలో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ప్రవర్తించిన తీరు వివాదాస్పదమైంది. కివీస్‌ తొలి ఇన్నింగ్స్‌ 44వ ఓవర్లో టామ్‌ లాథమ్‌ (52)ను మహ్మద్‌ షమి క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. అప్పటికే హాఫ్‌ సెంచరీ చేసిన అతడు న్యూజిలాండ్‌ను భారీ స్కోరు దిశగా నడిపిస్తుండడం, మరోవైపు స్టేడియంలోని కొందరు ఫ్యాన్స్‌ టీమిండియాను గేలి చేస్తున్న తరుణంలో లాథమ్‌ అవుట్‌ కావడంతో కోహ్లీ ఆగ్రహంగా స్పందించాడు. గట్టిగా అరుస్తూ ‘ఇక నోర్మూసుకోండి’ అని అర్థం వచ్చేలా కుడిచేయి చూపుడు వేలును పెదవుల మీద ఉంచిన తీరుపైౖ సోషల్‌మీడియాలో కోహ్లీని విమర్శిస్తున్నారు.


ఎవరినీ నిందించం

వైఫల్యాలను ఒకరిపై నెట్టే సంస్కృతి జట్టులో లేదు. అందుకే ఎవరిపైనా నిందారోపణలు చేయం. బౌలింగ్‌ వి భాగం వికెట్లు పడగొట్టక పోతే.. బ్యాట్స్‌మెన్‌ స్వే చ్ఛగా ఆడే పరిస్థితులు ఉండకపోవచ్చు. క్రీజులో ఉన్న విహారి, పంత్‌ మెరుగ్గా ఆడితే పోరాడగలిగే లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందుంచవచ్చు. పిచ్‌పై తేమను కివీస్‌ బౌలర్ల అద్భుతంగా ఉపయోగించుకున్నారు. నేను ఎలా బౌలింగ్‌ చేస్తున్నానో నాకు తెలుసు. విమర్శలను పట్టించుకోను     - బుమ్రా 


స్కోరుబోర్డు

 భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 242

కివీస్‌ తొలి ఇన్నింగ్స్‌: లాథమ్‌ (బి) షమి 52; బ్లండెల్‌ (ఎల్బీ) ఉమేశ్‌ 30; విలియమ్సన్‌ (సి) పంత్‌ (బి) బుమ్రా 3; టేలర్‌ (సి) ఉమేశ్‌ (బి) జడేజా 15; నికోల్స్‌ (సి) కోహ్లీ (బి) షమి 14; వాట్లింగ్‌ (సి) జడేజా (బి) బుమ్రా 0; గ్రాండ్‌హోమ్‌ (బి) జడేజా 26; సౌథీ (సి) పంత్‌ (బి) బుమ్రా 0; జేమిసన్‌ (సి) పంత్‌ (బి) షమి 49; వాగ్నర్‌ (సి) జడేజా (బి) షమి 21; బౌల్ట్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు: 24; మొత్తం: 73.1 ఓవర్లలో 235 ఆలౌట్‌. వికెట్ల పతనం: 1-66, 2-69, 3-109, 4-130, 5-133, 6-153, 7-153, 8-177, 9-228, 10-235. బౌలింగ్‌: బుమ్రా 22-5-62-3; ఉమేశ్‌ యాదవ్‌ 18-2-46-1; మహ్మద్‌ షమి 23.1-3-81-4; రవీంద్ర జడేజా 10-2-22-2.


భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: పృథ్వీ షా (సి) లాథమ్‌ (బి) సౌథీ 14; మయాంక్‌ (ఎల్బీ) బౌల్ట్‌ 3; పుజార (బి) బౌల్ట్‌ 24; కోహ్లీ (ఎల్బీ) గ్రాండ్‌హోమ్‌ 14; రహానె (బి) వాగ్నర్‌ 9; ఉమేశ్‌ యాదవ్‌ (బి) బౌల్ట్‌ 1; విహారి (బ్యాటింగ్‌) 5; పంత్‌ (బ్యాటింగ్‌) 1; ఎక్స్‌ట్రాలు: 19; మొత్తం: 36 ఓవర్లలో 90/6. వికెట్ల పతనం: 1-8, 2-26, 3-51, 4-72, 5-84, 6-89. బౌలింగ్‌: సౌథీ 6-2-20-1; బౌల్ట్‌ 9-3-12-3; జేమిసన్‌ 8-1-18-0; గ్రాండ్‌హోమ్‌ 5-3-3-1; వాగ్నర్‌ 8-1-18-1.

Updated Date - 2020-03-02T10:13:45+05:30 IST