ఐపీఎల్ ప్రారంభంలో కెప్టెన్‌గా సీఎస్‌కే ఫస్ట్ చాయిస్ ధోనీ కాదట !?
ABN , First Publish Date - 2020-09-12T23:32:42+05:30 IST
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2008లో ప్రారంభమైన విషయం తెలిసిందే.

చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2008లో ప్రారంభమైన విషయం తెలిసిందే. లీగ్ ప్రారంభంలో చాలా జట్ల యాజమాన్యాలు కెప్టెన్సీ పగ్గాలు సీనియర్ ఆటగాళ్లకే అప్పగించాయి. అలాగే చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) యాజమాన్యం కూడా కెప్టెన్‌గా మొదట ధోనీని అనుకోలేదట. ఎలాగైన వేలంలో డాషింగ్ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్‌ను దక్కించుకుని ఆయనకే కెప్టెన్సీ ఇవ్వాలనేది చెన్నై ఆలోచన. అయితే, సెహ్వాగ్ మాత్రం తాను మొదటి నుంచి ఢిల్లీకే ప్రాతినిథ్యం వహిస్తున్నాను కనుక ఢిల్లీ ఫ్రాంచైజీ అయిన ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కే ఆడతానని చెప్పాడట. దాంతో చెన్నై వీరుపై ఆశలు వదులుకుంది.
అదే సమయంలో సీఎస్‌కే వేలం పాటలో మహేంద్రుడిని ఏకంగా రూ.6 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ ముందు ఏడాదినే అంటే 2007లో ధోనీ సారథ్యంలోని భారత జట్టు సౌతాఫ్రికాలో జరిగిన తొలి టీ20 వరల్డ్ కప్ గెలవడమే దీనికి కారణం. ఆ నమ్మకంతోనే సీఎస్‌కే యాజమాన్యం తమ జట్టు పగ్గాలు ధోనీకే అప్పగించింది. ఇలా కెప్టెన్‌గా సీఎస్‌కే ఫస్ట్ చాయిస్ వీరేంద్రుడి నుంచి మహేంద్రుడికి మారింది. ఈ విషయాలను తాజాగా భారత మాజీ క్రికెటర్, సీఎస్‌కే ఆటగాడు బద్రినాథ్ యూట్యూబ్ చానెల్ ద్వారా వెల్లడించారు. కాగా, 2008 నుంచి ఇప్పటివరకు చెన్నై కెప్టెన్సీని మార్చకపోవడం గమనార్హం. ఇక ధోనీ సారథ్యంలో సీఎస్‌కే మూడు సార్లు(2010, 2011, 2018) ఐపీఎల్ టైటిళ్లు గెలవగా, రెండు సార్లు(2010, 2014) ఛాంపియన్స్ లీగ్ ట్వంటీ 20 విజేతగా నిలిచింది.