తండ్రి కోల్పోయిన బాధలో సిరాజ్.. అయినా భారత జట్టుతోనే!
ABN , First Publish Date - 2020-11-22T02:52:04+05:30 IST
ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటనలో ఉన్న టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ తండ్రిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నాడు. తన

న్యూఢిల్లీ: ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటనలో ఉన్న టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ తండ్రిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నాడు. తన ఎదుగుదలలో కీలకపాత్ర పోషించిన తండ్రిని తలచుకుని కన్నీరుమున్నీరవుతున్నాడు. కష్టకాలంలో అండగా నిలిచిన బీసీసీఐ అవసరమైతే భారత్‌కు వెళ్లొచ్చంటూ సిరాజ్‌కు అవకాశం ఇచ్చింది. సిరాజ్‌తో మాట్లాడామని, కావాలనుకుంటే అతడు ఇండియా వెళ్లొచ్చని బీసీసీఐ తెలిపింది. అయితే, సిరాజ్ మాత్రం జట్టుతోనే ఉండాలని నిర్ణయించుకున్నట్టు బోర్డు పేర్కొంది. దేశం కోసం ఆడాలనే అతడు నిర్ణయించుకున్నాడని, ఈ కష్టకాలంలో అతడికి మద్దతుగా ఉంటామని వివరించింది. తండ్రిని కోల్పోయిన సిరాజ్‌కు బీసీసీఐ చీఫ్ గంగూలీ, సురేశ్ రైనా వంటి వారు తమ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ కష్టం నుంచి అతడు త్వరగా బయటపడాలని, ఆస్ట్రేలియా పర్యటనలో అతడు విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ గంగూలీ ట్వీట్ చేశాడు. సిరాజ్, అతడి కుటుంబానికి తన సంతాపం తెలుపుతూ రైనా ట్వీట్ చేశాడు.
హైదరాబాద్‌కు చెందిన 26 ఏళ్ల సిరాజ్ ఆస్ట్రేలియాతో జరగనున్న పరిమిత ఓవర్ల సిరీస్‌కు ఎంపిక కాకున్నా, నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడే జట్టులో చోటు దక్కింది. దాదాపు రెండు నెలలపాటు కొనసాగనున్న ఈ పర్యటన ఈ నెల 27 నుంచి ప్రారంభం కానుండగా, వచ్చే నెల 17 నుంచి టెస్టు సిరీస్ ప్రారంభం అవుతుంది.