నాన్న కల కోసం.. అమ్మ రావొద్దంది
ABN , First Publish Date - 2020-11-25T09:56:21+05:30 IST
హైదరాబాద్ యువ పేసర్ మహ్మద్ సిరాజ్ తండ్రి మహ్మద్ గౌస్ అనారోగ్యంతో నాలుగురోజుల క్రితం మరణించారు. ఆ సమయంలో ఆస్ట్రేలియా..

న్యూఢిల్లీ: హైదరాబాద్ యువ పేసర్ మహ్మద్ సిరాజ్ తండ్రి మహ్మద్ గౌస్ అనారోగ్యంతో నాలుగురోజుల క్రితం మరణించారు. ఆ సమయంలో ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న సిరాజ్ తండ్రి అంత్యక్రియలకు దూరమయ్యాడు. తండ్రి చివరి చూపునకు నోచుకోకపోవడంపై భావోద్వేగానికి గురైన సిరాజ్.. నాన్న కల నెరవేర్చడం కోసం జట్టుతోనే ఉండమని స్వయంగా అమ్మ చెప్పిందని బీసీసీఐకిచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ‘నేను భారత్‌కు ఆడుతుంటే చూడాలని నాన్న తపించాడు. నాన్న మరణవార్త తెలిసి ఇంటికి ఫోన్ చేసినప్పుడు అమ్మ ఇదే విషయాన్ని గుర్తుచేసింది. నాన్న కల నెరవేర్చడంపైనే దృష్టి పెట్టు.. ఆస్ట్రేలియాలో ఆట ఆడిన తర్వాతే ఇంటికి వచ్చెయ్.. అధైర్యపడకు.. ఈ పరిస్థితుల్లో ధైర్యంగా ఉండడం నీతో పాటు మన కుటుంబానికి ఎంతో అవసరం అని అమ్మ చెప్పింది’ అని ఆ ఇంటర్వ్యూలో సిరాజ్ వెల్లడించాడు.