హెచ్‌సీఏలో ఏకాకి..అజర్‌

ABN , First Publish Date - 2020-09-05T09:12:23+05:30 IST

కొంతకాలంగా నివురుగప్పిన నిప్పు లా ఉన్న హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) అంతర్గత కుమ్ములాటలు...

హెచ్‌సీఏలో ఏకాకి..అజర్‌

అంబుడ్స్‌మన్‌ నియామకంపై కార్యవర్గం తిరుగుబాటు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): కొంతకాలంగా నివురుగప్పిన నిప్పు లా ఉన్న హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) అంతర్గత కుమ్ములాటలు అం బుడ్స్‌మన్‌, ఎథిక్స్‌ అధికారి నియామక వ్యవహారంతో బట్టబయలయ్యాయి. భారత్‌ మాజీ కెప్టెన్‌, హెచ్‌సీఏ అధ్యక్షుడు మహ్మద్‌ అజరుద్దీన్‌ అసోసియేషన్‌ పాలన సంబంధిత నిర్ణయాలను ఏకపక్షంగా తీసుకుంటున్నారని కార్యవర్గ సభ్యులు గుర్రుగా ఉన్నారు. ఏజీఎం నిర్వహించకుండా ఈనెల 2వ తేదీన రిటైర్డ్‌ చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ వర్మను అంబుడ్స్‌మన్‌గా నియమిస్తూ అజర్‌ తీసుకున్న నిర్ణయం హెచ్‌సీఏ రాజ్యాంగానికి విరుద్ధమని ప్రధాన కార్యదర్శి విజయానంద్‌తో కూడిన కార్యవర్గం అసమ్మతి వెళ్లగక్కింది. ‘అజర్‌ చేసిన ఏకపక్ష నియామకం హెచ్‌సీఏ కార్యవర్గ సభ్యులకు తెలియదు. ఈ నియామకం చట్ట విరుద్ధమైనందున అజర్‌ నిర్ణయాన్ని పరిగణనలోనికి తీసుకోవడం లేదు’ అని తెలియజేస్తూ కార్యవర్గ బృందం సంతకాలతో కూడిన లేఖను రిటైర్డ్‌ జస్టిస్‌ దీపక్‌కు హెచ్‌సీఏ పంపింది. దీనిపై అజరుద్దీన్‌ స్పందిస్తూ గత జూన్‌ 6వ తేదీన జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీలో అంబుడ్స్‌మన్‌ నియామకంపై నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టత ఇచ్చాడు. కరోనా నేపథ్యంలో ఇప్పట్లో ఏజీఎం నిర్వహించే అవకాశం లేనందున నిబంధనలకు అనుగుణంగానే ఈ నియామకం చేసినట్టు అజర్‌ వివరణ ఇచ్చాడు. ఇటీవల హైదరాబాద్‌ రంజీ ప్లేయర్‌ బవనాక సందీప్‌ గోవాకు తరలిపోవడంతో పాటు పలు పాలనాపరమైన విషయాల్లో కార్యవర్గ సభ్యులకు, అజరుద్దీన్‌ మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడంతో అధ్యక్షుడు వర్సెస్‌ కార్యవర్గ సభ్యులుగా హెచ్‌సీఏ రాజకీయం వేడెక్కింది.

Updated Date - 2020-09-05T09:12:23+05:30 IST