హై..హై నాయకా

ABN , First Publish Date - 2020-12-28T09:53:29+05:30 IST

బౌలర్ల శ్రమను వృధా చేయకుండా భారత బ్యాట్స్‌మెన్‌ బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నారు. దీంతో రెండో టెస్టుపై టీమిండియా క్రమేపీ పట్టు బిగిస్తోంది...

హై..హై నాయకా

అండగా జడేజా 

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 277/5 

ప్రస్తుత ఆధిక్యం 82

రహానె అజేయ శతకం  


తొలి రోజు తన వ్యూహాలతో బౌలర్లను మారుస్తూ ప్రత్యర్థిని బోల్తా కొట్టించాడు. ఇక జట్టు  64/3 స్కోరుతో  ఇబ్బందుల్లో పడిన తరుణంలో నేనున్నానంటూ అజేయ శతకంతో అండగా నిలిచాడు ‘కెప్టెన్‌’ రహానె. ఆరంభంలో పరిస్థితి చూస్తే ఈ మ్యాచ్‌లోనూ మనోళ్లు బ్యాట్లెత్తేయడం ఖాయమేమో అనిపించింది. కానీ ఆసీస్‌ బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ ‘జింక్స్‌’ కళాత్మక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. పట్టుదలగా క్రీజులో నిలిచి వరుసగా మూడు కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. అటు జడేజా కూడా సహకరిస్తుండగా ప్రస్తుతం భారత్‌ ఆధిక్యంలో నిలిచింది. కంగారూల ఫీల్డింగ్‌ వైఫల్యం కూడా జట్టుకు కలిసివచ్చింది.


మెల్‌బోర్న్‌: బౌలర్ల శ్రమను వృధా చేయకుండా భారత బ్యాట్స్‌మెన్‌ బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నారు. దీంతో రెండో టెస్టుపై టీమిండియా క్రమేపీ పట్టు బిగిస్తోంది. కెప్టెన్‌ అజింక్యా రహానె (200 బంతుల్లో 12 ఫోర్లతో 104 బ్యాటింగ్‌) తన పరుగుల దాహాన్ని తీర్చుకుంటూ అజేయ శతకంతో మెరిశాడు. 2014లో ఈ మైదానంలో  చేసిన సెంచరీని గుర్తుచేసుకుంటూ జట్టు ఇన్నింగ్స్‌ నిర్మించాడు. దీంతో ఆసీ్‌సతో జరుగుతున్న రెండో టెస్టులో భారత్‌ 82 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఆదివారం ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 91.3 ఓవర్లలో 5 వికెట్లకు 277 పరుగులు సాధించింది. జడేజా (104 బంతుల్లో 1 ఫోర్‌తో 40 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నాడు. గిల్‌ (45) ఫర్వాలేదనిపించాడు. స్టార్క్‌, కమిన్స్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. అటు ఆస్ట్రేలియా ఫీల్డర్లు నాలుగు క్యాచ్‌లు వదిలేయడం గమనార్హం. అలాగే మ్యాచ్‌కు రెండుసార్లు వర్షం అంతరాయం కలిగించింది. సోమవారం మరో రెండు సెషన్లపాటు బ్యాటింగ్‌ కొనసాగిస్తే భారత్‌ పటిష్ట స్థితిలో నిలుస్తుంది.


కమిన్స్‌ దెబ్బ: ఓవర్‌నైట్‌ స్కోరు 36/1తో మొదటి ఇన్నింగ్స్‌  కొనసాగించిన భారత్‌ తొలి గంటపాటు బాగానే ఆడింది. ఆరంభంలోనే క్యాచ్‌ అవుట్‌ నుంచి తప్పించుకున్న ఓపెనర్‌ గిల్‌ హాఫ్‌ సెంచరీకి చేరువయ్యాడు. కానీ పేసర్‌ కమిన్స్‌ తన వరుస ఓవర్లలో గిల్‌, పుజార వికెట్లను తీసి భారత్‌ కు షాకిచ్చాడు. ఈ రెండు క్యాచ్‌లను కీపర్‌ పెయిన్‌ అందుకున్నాడు. దీంతో నాలుగో నెంబర్‌లో బరిలోకి దిగిన రహానె.. విహారి (21)తో కలిసి నిదానంగా ఆడుతూ మరో వికెట్‌ పడకుండా భోజన విరామానికి వెళ్లారు. 


రహానె అండగా..: బ్రేక్‌ తర్వాత విహారి ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. స్పిన్నర్‌ లియాన్‌ ఓవర్‌లో అనవసరంగా స్వీప్‌ షాట్‌కు వెళ్లి స్మిత్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. నాలుగో వికెట్‌కు  రహానెతో కలిసి 52 పరుగులు జత చేశాడు. ఆ తర్వాత పంత్‌ (29) ఎదురుదాడితో సమాధానమిచ్చాడు. ఓవైపు రహానె డిఫెన్సివ్‌ ఆటతో ఒత్తిడి పెంచుతుండగా పంత్‌ బౌండరీలతో జోరు చూపాడు. 56వ ఓవర్‌లో అతడి క్యాచ్‌ను గ్రీన్‌ వదిలేశాడు. అయితే మరింత ప్రమాదకరంగా మారకముందే పంత్‌ను 60వ ఓవర్‌లో స్టార్క్‌ పెవిలియన్‌కు చేర్చాడు. ఈ వికెట్‌ అతడికి 250వది కాగా, డైవ్‌చేస్తూ అద్భుతమైన క్యాచ్‌ పట్టిన కీపర్‌ పెయిన్‌కు 150వ అవుట్‌ కావడం విశేషం. పంత్‌తో కలిసి ఐదో వికెట్‌కు రహానె 57 పరుగులు జోడించాడు. 66వ ఓవర్‌లో రహానె ఫోర్‌తో భారత్‌ ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత వర్షం కురవడంతో ముందుగానే టీ బ్రేక్‌ ప్రకటించారు.


శతక భాగస్వామ్యం: చివరి సెషన్‌లో రహానె, జడేజా పూర్తి ఆధిపత్యం చూపారు. ఆసీస్‌ బౌలర్లను సమర్ధంగా ఎదుర్కొన్న ఈ జోడీ వారికి ఎలాంటి అవకాశమూ ఇవ్వలేదు. ఆరో వికెట్‌కు అజేయంగా 104 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ సెషన్‌లో రహానె బ్యాట్‌ ఝుళిపిస్తూ చూడముచ్చటైన ఆఫ్‌ డ్రైవ్‌ షాట్లతో చెలరేగాడు. మరోవైపు జడ్డూ భారీ షాట్ల జోలికి వెళ్లకుండా ఎక్కువగా సింగిల్స్‌, డబుల్స్‌పై దృష్టి సారించాడు. రెండో రోజు ఆట చివర్లో ఓ ఫోర్‌తో రహానె కెరీర్‌లో 12వ సెంచరీని పూర్తి చేశాడు. ఆ తర్వాత 92వ ఓవర్‌లో వర్షం కురవడంతో మ్యాచ్‌ను ముందుగానే ముగించారు. ఈ సెషన్‌లో రహానెకు అదృష్టం కూడా తోడుగా నిలిచింది. 74 పరుగుల వద్ద ఉన్నప్పుడు స్మిత్‌.. 104 వద్ద హెడ్‌ అతడి క్యాచ్‌లను వదిలేశారు.


అజింక్యాపై ప్రశంసలు

అజేయ శతకంతో భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం అందించిన రహానెపై కెప్టెన్‌ కోహ్లీతో పాటు పలువురు మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిపించారు. ‘భారత్‌కు మరో అద్భుతమైన రోజు. రహానె నుంచి ఇది  అమోఘ ఇన్నింగ్స్‌’ అని కోహ్లీ ట్వీట్‌ చేశాడు. ఇక అతడి వ్యక్తిత్వంలాగే ప్రశాంతమైన ఆటతో కెప్టెన్సీ ఇన్నింగ్స్‌ ఆడాడని, ఫీల్డింగ్‌, బౌలర్లను మార్చడంలోనూ అజింక్యా వ్యూహం ఫలించిందని యువరాజ్‌ అన్నాడు. అలాగే లార్డ్స్‌లో రహానె సెంచరీ ప్రత్యేకమైనదే అయినా.. ఈసారి కెప్టెన్‌గా.. జట్టు 0-1తో వెనుకంజలో ఉన్న దశలో చేసిన తాజా శతకం అంతకుమించేలా ఉందని ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైకేల్‌ వాన్‌ కొనియాడాడు.  గవాస్కర్‌, బేడీ, రైనా, సెహ్వాగ్‌ కూడా అభినందనలు తెలిపారు. మరోవైపు రహానె అద్భుతంగా ఆడినప్పటికీ, ఐదుసార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడని ఆసీస్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ అన్నాడు.


ఎంసీజీలో రెండు సెంచరీలు చేసిన రెండో భారత బ్యాట్స్‌మన్‌ రహానె. గతంలో వినూ మన్కడ్‌ ఈ ఫీట్‌ సాధించాడు.


ఆసీస్‌ గడ్డపై అరంగేట్ర టెస్టులో అత్యధిక రన్స్‌ చేసిన మూడో భారత బ్యాట్స్‌మెన్‌గా గిల్‌ (45).    మయాంక్‌ (2018లో 76), దత్తు ఫడ్కర్‌ (1947లో 51) ముందున్నారు.


 కంగారూలపై సెంచరీ చేసిన భారత ఐదో టెస్టు కెప్టెన్‌ రహానె. గతంలో అజర్‌, సచిన్‌, గంగూలీ, కోహ్లీ ఉన్నారు. అలాగే 21 ఏళ్ల తర్వాత ఎంసీజీలో శతకం బాదిన భారత కెప్టెన్‌గానూ నిలిచాడు. 


స్కోరుబోర్డు

ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌: 195

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: మయాంక్‌ (ఎల్బీ) స్టార్క్‌ 0; గిల్‌ (సి) పెయిన్‌ (బి) కమిన్స్‌ 45; పుజార (సి) పెయిన్‌ (బి) కమిన్స్‌ 17; రహానె (బ్యాటింగ్‌) 104; విహారి (సి) స్మిత్‌ (బి) లియాన్‌ 21; పంత్‌ (సి) పెయిన్‌ (బి) స్టార్క్‌ 29; జడేజా (బ్యాటింగ్‌) 40; ఎక్స్‌ట్రాలు: 21; మొత్తం: 91.3 ఓవర్లలో 277/5. వికెట్ల పతనం: 1-0, 2-61, 3-64, 4-116, 5-173. బౌలింగ్‌: స్టార్క్‌ 18.3-3-61-2; కమిన్స్‌ 22-7-71-2; హాజెల్‌వుడ్‌ 21-6-44-0; లియాన్‌ 18-2-52-1; గ్రీన్‌ 12-1-31-0.

Updated Date - 2020-12-28T09:53:29+05:30 IST