టెస్టుల్లో ‘వెలుతురు’ నిబంధనల్లో మార్పులు?
ABN , First Publish Date - 2020-08-20T09:53:04+05:30 IST
టెస్టుల్లో ‘వెలుతురు లేమి’ నిబంధనలను మార్చాలని ఐసీసీ భావిస్తోంది. పాకిస్థాన్-ఇంగ్లండ్ మధ్య రెండో టెస్టులో సింహభాగం సరైన వెలుతురులేని కారణంగా ...

న్యూఢిల్లీ: టెస్టుల్లో ‘వెలుతురు లేమి’ నిబంధనలను మార్చాలని ఐసీసీ భావిస్తోంది. పాకిస్థాన్-ఇంగ్లండ్ మధ్య రెండో టెస్టులో సింహభాగం సరైన వెలుతురులేని కారణంగా తుడిచి పెట్టుకుపోవడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో తదుపరి జరిగే ఐసీసీ క్రికెట్ కమిటీ సమావేశంలో ఈ రూల్‌పై చర్చించనున్నారు. ప్రస్తుతం లైట్ మీటర్‌తో వెలుతురు సరిపోను ఉందో లేదో అంపైర్లు తెలుసుకుంటున్నారు. వెలుతురు సరిగా లేకపోతే.. ఫ్లడ్‌లైట్లలో టెస్టును కొనసాగించే ప్రతిపాదనను 2013లో ఐసీసీ ప్రతిపాదించింది. అయితే సభ్య దేశాలు ఆ ప్రతిపాదనను వ్యతిరేకించాయి. కాగా.. వెలుతురులేమితో టెస్టును నష్టపోకుండా ఉండాలంటే.. బంతి బాగా కనబడేందుకు డే/నైట్ టెస్టుల్లో మాదిరి గులాబీ బంతిని ఉపయోగించాలని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ సూచించాడు. అతడి సూచనను ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ కూడా సమర్థించాడు. రెండు జట్లు కనుక ముందస్తుగా అంగీకరిస్తే.. ద్వైపాక్షిక సిరీ్‌సలలో పింక్ బాల్‌ను ఉపయోగించేందుకు ప్రస్తుత నిబంధనలు అనుమతిస్తున్నాయి.