ఆడితేనే డబ్బు!
ABN , First Publish Date - 2020-04-01T09:57:17+05:30 IST
ఐపీఎల్ అంటే బీసీసీఐతో పాటు ప్రసారకర్తలకు కాసులు కురిపించడమే కాదు.. అటు ఆటగాళ్లను కూడా రాత్రికి రాత్రే కోటీశ్వరులను చేస్తుంది. అనామక ఆటగాళ్లపై కూడా ఒక్కోసారి ఈ లీగ్ విపరీతమైన కరుణ చూపిస్తుంటుంది. ఎప్పటిలాగే ఈ ఏడాది జరిగిన

- ఐపీఎల్ రద్దుతో ఆటగాళ్లకు నష్టమే..
ఐపీఎల్ అంటే బీసీసీఐతో పాటు ప్రసారకర్తలకు కాసులు కురిపించడమే కాదు.. అటు ఆటగాళ్లను కూడా రాత్రికి రాత్రే కోటీశ్వరులను చేస్తుంది. అనామక ఆటగాళ్లపై కూడా ఒక్కోసారి ఈ లీగ్ విపరీతమైన కరుణ చూపిస్తుంటుంది. ఎప్పటిలాగే ఈ ఏడాది జరిగిన వేలంలోనూ పలువురు యువ ఆటగాళ్లతో పాటు స్టార్ క్రికెటర్లపై అనూహ్యంగా కోట్ల వర్షం కురిసింది. కానీ ఇప్పుడు వారందరికీ కరోనా కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.. ఎందుకంటే ఈ లీగ్ జరిగితేనే వారికి డబ్బు ముట్టేది మరి..
నో ప్లే.. నో పే.. ఈ ఏడాది ఐపీఎల్ ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్న ఆటగాళ్ల ముందున్న పరిస్థితి ఇదే. దేశవ్యాప్తంగా కరోనా ఉధృతి తీవ్రంగా ఉండడంతో ముందు జాగ్రత్తగా ఐపీఎల్-13వ సీజన్‌ను ఏప్రిల్ 15 వరకు వాయిదా వేశారు. ఇప్పుడు ఈ నెలలోనూ జరుగుతుందనే భరోసా బీసీసీఐ ఇవ్వలేకపోతోంది. ఎందుకంటే పరిస్థితి మరింత దారుణంగా తయారుకావడంతో ఇప్పుడు ఐపీఎల్ జరగాలని కూడా ఎవరూ అనుకోవడంలేదు. దీంతో రద్దు వైపే అందరి ఆలోచనలు సాగుతున్నాయి. ఒకవేళ ఈ ఏడాది ఐపీఎల్ నిర్వహణ వీలు కాకపోతే ఎక్కువగా నష్టపోయేది ఆటగాళ్లే. సహజంగా ఐపీఎల్లో ఆటగాళ్లకు చెల్లింపు విధానం ఓ క్రమ పద్ధతిలో సాగుతుంటుంది. లీగ్ జరగడానికి వారం ముందుగానే తమ ఆటగాళ్లతో కుదుర్చుకున్న మొత్తం విలువలో 15 శాతం చెల్లించేస్తారు. ఇక టోర్నీ మధ్యలో మరో 65 శాతం చెల్లింపు జరిగిపోతుంటుంది. మిగిలిన 20 శాతాన్ని లీగ్ ముగిశాక నిర్ణీత సమయంలో ఆయా ఫ్రాంచైజీలు ఇచ్చేస్తుంటాయి. కానీ ఇప్పుడు వాయిదా పడడంతో ఎవరికీ తొలి విడత డబ్బు అందకుండా పోయింది.
వర్థమాన ఆటగాళ్లకే ఇబ్బంది..
నిజానికి ఈ లీగ్ ద్వారా వచ్చే డబ్బుపై కోహ్లీ, ధోనీ, రోహిత్‌లాంటి స్టార్ ఆటగాళ్లేమీ ఆధారపడి లేరు. వారికందే మొత్తం భారీదే అయినా ఇతరత్రా వ్యాపారాలతో వందల కోట్లు సంపాదిస్తున్నారు. కానీ చిన్న నగరాల నుంచి ఇప్పుడిప్పుడే అందరినీ ఆకర్షిస్తున్న యువ ఆటగాళ్లకు, దేశవాళీల్లో రాణిస్తున్న వారికి ఈ లీగ్ జరగడం చాలా ముఖ్యం. లేకుంటే ఆర్థికంగా చాలా ప్రభావం పడుతుంది. కొత్తగా ఆడుతున్న వారికైతే రూ.20 నుంచి 40, 60 లక్షలు దక్కినా అది వారి జీవితాలను ప్రభావితం చేసే మొత్తమే. ఒకవేళ లీగ్ కరోనా వైరస్ కారణంగా రద్దయితే ఆటగాళ్ల జీతాల విషయంలో ఇన్సూరెన్స్ వర్తించదని ఫ్రాంచైజీలు చెబుతున్నాయి. ఇంతకుముందే కుదుర్చుకున్న నిబంధనల్లో ఈ క్లాజ్ లేకపోవడమే కారణం.
వేతనాల్లో కోతపై..
ఆటగాళ్ల వేతనాల్లో కోత విషయంలో ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధూమల్ స్పష్టం చేశారు. కానీ తాజాగా కొనసాగుతున్న విపత్కర పరిస్థితిని అందరూ అర్థం చేసుకోవాలని భారత క్రికెటర్ల సంఘం (ఐసీఏ) అధ్యక్షుడు అశోక్ మల్హోత్రా కోరుతున్నాడు. దేశవాళీ ఆటగాళ్ల వేతనాల్లో కోత ఉండకపోయినా పెరుగుదలను ఆశించడం అత్యాశే అవుతుందని ఆయన తెలిపారు. క్రికెట్ నుంచే బీసీసీకి ఆదాయం వస్తుందని, అలాంటిది మ్యాచ్‌లు జరగనప్పుడు డబ్బు ఎలా సమకూరుతుందని ప్రశ్నించాడు.
అక్టోబరులో ఐపీఎల్!
ఒకవేళ టీ20 వరల్డ్‌కప్ రద్దయితే అక్టోబరు-నవంబరులో ఐపీఎల్ జరిగే అవకాశం ఉంటుందని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. టీ20 వరల్డ్‌క్‌పను 2022కు వాయిదా వేస్తే ఆ విండో ఖాళీగా ఉంటుం ది కాబట్టి ఐపీఎల్ కోసం ఉపయోగించుకోవాలనే ఆలోచనలో బోర్డు ఉంది.