ఆడియన్స్ లేకుండా ఐపీఎల్ నిర్వహించవచ్చు: హార్థిక్ పాండ్యా

ABN , First Publish Date - 2020-04-27T00:39:55+05:30 IST

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్ రద్దైన విషయం తెలిసిందే. తొలుత కరోనా కారణంగా ఏప్రిల్ 14వ తేదీ వరకూ లాక్‌డౌన్

ఆడియన్స్ లేకుండా ఐపీఎల్ నిర్వహించవచ్చు: హార్థిక్ పాండ్యా

ముంబై: కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్ రద్దైన విషయం తెలిసిందే. తొలుత కరోనా కారణంగా ఏప్రిల్ 14వ తేదీ వరకూ లాక్‌డౌన్ విధించడంతో.. ఏప్రిల్ 15వ తేదీ నుంచి ఐపీఎల్ ఆరంభం అవుతుందని అంతా భావించారు. కానీ కరోనా వ్యాప్తి మరింత ఉదృతం కావడంతో.. లాక్‌డౌన్‌ను మే 3వ తేదీ వరకూ పొడిగించారు. ఫలితంగా ఐపీఎల్‌ను రద్దు చేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. 


ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ను ఆడియన్స్ లేకుండా నిర్వహించాలంటూ కొందరు సూచనలు చేస్తున్నారు. మైదానంలోకి ప్రేక్షకులను అనుమతించకుండా.. మ్యాచ్‌లను కేవలం లైవ్ టెలికాస్ట్‌లో చూసే వీలు మాత్రమే కల్పించాలని వాళ్లు కోరుతున్నారు. మరికొందరు మాత్రం ఆడియన్స్ లేకుండా ఐపీఎల్‌ను నిర్వహించడం సాధ్యం కాదని అంటున్నారు. 


అయితే ఆడియన్స్‌ లేకుండా ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించడం సాధ్యమవుతుందని టీం ఇండియా ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా అభిప్రాయపడ్డాడు. వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ దినేశ్ కార్తీక్‌తో కలిసి లైవ్ ఛాట్‌లో పాల్గొన్న హార్థిక్ దీనిపై కామెంట్ చేశాడు. గతంలో తాను ఆడియన్స్ లేకుండా రంజీ మ్యాచ్‌ ఆడిన విషయాన్ని హార్థిక్ గుర్తు చేశాడు. ‘‘మామూలుగా జరిగే మ్యాచ్‌లతో పోలిస్తే.. ఇది కాస్త భిన్నంగా ఉంటుంది. నేను రంజీ ట్రోఫీలో అలాంటి మ్యాచ్ ఒకటి ఆడాను. ఐపీఎల్ ఆడియన్స్ లేకుండా జరపడం నిజంగా తెలివైన నిర్ణయం. కనీసం ఇంట్లో ఉండి అయినా.. ప్రేక్షుకులు ఎంజాయ్ చేస్తారు’’ అని హార్థిక్ అన్నాడు. హార్థిక్ అభిప్రాయంతో అతని సోదరుడు కృనాల్ పాండ్యా కూడా ఏకీభవించాడు.

Updated Date - 2020-04-27T00:39:55+05:30 IST