అంతా బాగుంటే.. ఐపీఎల్, ప్రపంచకప్ రెండూ భారత్‌లోనే..: గవాస్కర్
ABN , First Publish Date - 2020-04-21T20:34:41+05:30 IST
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఇప్పటికే పలు క్రికెట్ టోర్నమెంట్‌లు రద్దైన విషయం తెలిసిందే. ఇందులో క్రికెట్ అభిమానులు ఎంతగానో ఇష్టపడే ఇండియన్

ముంబై: కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఇప్పటికే పలు క్రికెట్ టోర్నమెంట్‌లు రద్దైన విషయం తెలిసిందే. ఇందులో క్రికెట్ అభిమానులు ఎంతగానో ఇష్టపడే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కూడా ఉంది. కేంద్రం మే 3వ తేదీ వరకూ దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో ఐపీఎల్‌ను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. మరోవైపు ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన టీ-20 ప్రపంచకప్ నిర్వహణపై కూడా సందిగ్ధత నెలకొంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆస్ట్రేలియా ఆరు నెలల పాటు తమ సరిహద్దులను మూసివేసింది. ఈ గడువు సెప్టెంబర్ 30వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాలో ప్రపంచకప్ నిర్వహణకు ఏర్పాట్లు చేయడం ఐసీసీకి ప్రధాన సమస్యగా మారింది. అయితే త్వరలో అన్ని సమస్యలు తీరితే.. ఐపీఎల్‌తో పాటు.. టీ-20 ప్రపంచకప్ కూడా భారత్‌లోనే నిర్వహించవచ్చని టీం ఇండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అన్నారు.
ఐపీఎల్‌ను సెప్టెంబర్‌లో నిర్వహించి కొన్ని వారాల తర్వాత టీ-20 ప్రపంచకప్‌ను నిర్వహించ వచ్చని ఆయన ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ‘‘ఆస్ట్రేలియా విదేశీయులను తమ దేశంలోకి అనుమతించడం లేదు. వాళ్ల నిబంధనల ప్రకారం.. సెప్టెంబర్ 30 తర్వాతే విదేశీయులకు అనుమతి ఇస్తారు. కానీ, టోర్నమెంట్ అక్టోబర్ మూడో వారంలో ప్రారంభంకావాలి.. ఆ కొంత సమయంలో ఏర్పాటు చేయడం సులభం కాదు. అయితే వచ్చే ఏడాది టీ-20 ప్రపంచకప్ భారత్‌లో జరుగుతుంది. కాబట్టి.. ఆస్ట్రేలియా, భారత్ ఒక ఒప్పందం చేసుకొని.. టోర్నమెంట్‌ను ఈ ఏడాది భారత్‌లో.. వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో నిర్వహిస్తే బాగుటుంది. అదే జరిగితే.. ఈ టోర్నీకి కొన్ని వారాల ముందు ఐపీఎల్ పెడితే.. అది ప్రపంచకప్‌కి ప్రాక్టీస్‌లా ఉంటుంది’’ అని గవాస్కర్ అన్నారు.